జూన్ నాటికి లక్ష ఇళ్ల నిర్మాణం: కేటీఆర్

199
it ktr

ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నగరంలో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. నగరంలో ఇళ్ల నిర్మాణ చాలా వేగంగా నడుస్తోందని మొత్తం 109 ప్రాంతాల్లో లక్ష ఇళ్ల నిర్మాణాలు నడుస్తున్నాయని తెలిపారు.

బేగంపేటలోని మెట్రో రైల్ భవనంలో జరిగిన నగర మేయర్, కమిషనర్, ఇతర ఉన్నతాధికారులతో గ్రేట‌ర్‌లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాన్ని సమీక్షించారు కేటీఆర్. జీహెచ్ఎంసీ త‌ర‌పున ఇళ్ల నిర్మాణాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఇళ్ల నిర్మాణంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తూ ముందుకు వెళ్తున్నామని మంత్రికి అధికారులు తెలిపారు.

ప్రస్తుతం ఉన్న వేగంతో ముందుకు వెళ్తే వచ్చే డిసెంబర్ నాటికి సూమారు 40 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతున్నదని అధికారులు తెలిపారు. మిగిలిన ఇళ్ల నిర్మాణం వచ్చే ఏడాది జూన్ మాసం నాటికి పూర్తి చేస్తామన్న నమ్మకాన్ని అధికారులు వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణంలో స్థానిక యంఏల్యేలు, యంపిలను మరింత భాగస్వాములను చేయడం ద్వారా పర్యవేక్షణ, నిర్మాణ వేగం మరింత పెరుగుతుందన్నారు.

ktr

నియోజక వర్గాల వారీగా నిర్మాణం అవుతున్న ఇళ్ల సంఖ్య, ప్రాంతాలు( వర్క్ సైట్లు) తో జాబితా తయారు చేసి స్ధానిక యంఏల్యేలకు ఇవ్వాలన్నారు. లబ్దిదారుల ఏంపిక పైనా పారదర్శక విధానాన్ని రూపొందించేందుకు కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది, జియచ్ యంసి, హౌసింగ్ బోర్డు అధికారులు చర్చించాలన్నారు. అధార్ కార్డు, బయో మెట్రిక్, సమగ్ర కుటుంబ సర్వే వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని లోపరహితంగా ఏంపిక విధానం రూపొందించాలని అధికారులకు అదేశించారు.

ప్రస్తుతం ఉన్న జెయన్ యన్ యూఅర్, గృహ కల్ప ప్రాజెక్టుల్లో మిగిలిన సూమారు 13 వేల ఇళ్లను లబ్దిదారులకు అందించేందుకు ప్రణాళికలు రూపోందించాలని, అందుకు అవసరం అయిన అదనపు నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరతామని మంత్రి తెలిపారు. వందలు, వేలల్లో ఇళ్లు నిర్మాణం చేస్తున్న ప్రాంతాల్లో రోడ్డు, తాగునీటి సరఫరా, పోలీస్ స్టేషన్ల వంటి మౌళిక వసతుల కల్పన కోసం వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని ఇళ్ల నిర్మాణం అయ్యే నాటికి అయా వసతులు పూర్తి అయ్యేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డి, అడిషనల్ కమీషనర్ భారతి హోళికేరీ ,ఇతర ఉన్నతాదికారులున్నారు.