పోలింగ్ శాతం పెంచేందుకు అందరూ కృషి చేయాలి- ఈసీ

191
- Advertisement -

వివిధ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఓటర్లలో అవగాహన పెంచడం, ఓటింగ్ శాతాన్ని పెంచడం, ఎన్నికల దుష్ప్రవర్తనలు, దుర్మార్గాలు ఆపడంలో పౌర సమాజ సంఘాల పాత్ర, బాధ్యత ఎంతో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సి. పార్థసారధి అన్నారు. మంగళవారం (24.11.2020) రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో వివిధ పౌర సమాజ సంఘాల ప్రతినిధులతో జిహెచ్ఎసి ఎన్నికల సందర్భంగా సమావేశం ఏర్పాటు చేసారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ మాట్లాడుతూ.. జిహెచ్‌ఎంసికి జరిగిన సాధారణ ఎన్నికలలో 2002లో 41.22% 2009లో 42.95%,2016లో 45.27% పోలింగ్ నమోదు అయిందని, ఈ శాతాన్ని ప్రస్తుత ఎన్నికలలో పెంచేందుకు అందరూ కృషి చేయాలని అన్నారు. పోలింగ్ శాతం తక్కువగా ఉండడానికి ఒక ప్రధాన కారణం పోలింగ్ స్లిప్పుల పంపిణీ సక్రమంగా జరుగలేదని గుర్తించి, నవంబర్ 25వ తేది లోపు 100% పోలింగ్ స్లిప్పుల పంపిణీ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మునిసిపల్ డిప్యూటీ కమీషనర్, జోనల్ కమీషనర్ లకు ఆదేశాలు జారీ చేశామన్నారు.

ఓటరు స్లిప్పు అందిన ఓటరుకు ఓటు ఉందన్న నమ్మకం కలుగుతుందని, తాను ఓటు వేయాల్సిన పోలింగ్ కేంద్రం ముందుగా తెలపడం వల్ల ఓటు వేసేందుకు ముందుకు వస్తారన్నారు. ఓటరు అవగాహన పెంచి, పోలింగ్ శాతం పెంచేందుకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘం వివిధ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ప్రకటనలు, షార్ట్ ఫిలింలు, రేడియో, ఎఫ్ఎం రేడియో ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. రాజకీయ పార్టీలు కూడా పార్టీ గుర్తు లేకుండా ఓటరు స్లిప్పులు పంచవచ్చుఅన్నారు.

పౌర సమాజ సంఘాలు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని, మురికివాడలు, క్లబ్బులు, వాకర్ అసోసియేషన్లు, అపార్ట్ మెంట్ సొసైటిలు వేదికగా, సోషల్ మీడియా ద్వారా అవగాహన సదస్సులు, కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. సెలబ్రిటీల ద్వారా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రచారం చేసేలా చర్యలు తీసుకుంటుందని, పౌర సమాజ సంఘాలు మార్కెట్ స్థలాలు, నివాస ప్రాంతాలను వేదికలుగా ఎంచుకుని ఓటింగ్ శాతం పెంచేందుకు చర్చావేదికలు, సదస్సులు నిర్వహించాలన్నారు. పౌర సమాజ సంఘాలు ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ ఉల్లంఘనలు, అవకతవకలు, ఎన్నికల నియమ నిబందనల దుర్వినియోగం వంటివి రాష్ట్ర ఎన్నికల సంఘం ద్రుష్టికి తేవాలన్నారు. ఈ సమావేశానికి వివిధ పౌర సమాజ సంఘాల ప్రతినిధులు, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్, సంయుక్త కార్యదర్శి విజయసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -