జీహెచ్ఎంసీ ఎన్నికలలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిలు కుమ్మక్కై టికెట్లను అమ్ముకున్నారా…మొదటి నుంచి కాషాయ జెండా మోసిన బీజేపీ నేతలను కాదని, ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన ఇతర పార్టీల నేతలకు టికెట్లను కోట్లకు అమ్ముకున్నారా…ఇప్పుడిదే నిజమైన కాంగ్రెస్ కార్యకర్తల ఆవేదన లేఖలు, పోస్టుల రూపంలో వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. తాజాగా జూబ్లీహిల్స్ డివిజన్‌లో బీజేపీ నుంచి గెలిచిన కొత్త కార్పొరేటర్ డేరంగుల వెంకటేష్ ఇద్దరు పిల్లలుండాలన్న జీహెచ్ఎంసీ నిబంధనలు అతిక్రమించి తప్పుడు పత్రాలతో నామినేషన్ దాఖలు చేశాడని, కావున అతడిపై అనర్హత వేటు వేయాలంటూ టీఆర్‌ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ ఎన్నికల ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేశారు. డేరంగుల వెంకటేష్‌పై ఫోర్జరీ, ఛీటింగ్ కేసు కూడా నమోదు అయింది.
దీంతో తమ పార్టీ కార్పొరేటర్‌పై అనర్హత వేటు పడడం ఖాయమని బండి బ్యాచ్‌లో ఆందోళన నెలకొంది.. ఇప్పుడిదే నగర బీజేపీలో చిచ్చు రేపుతోంది. తాము వద్దని చెబుతున్నా ఎన్నికలప్పుడు పార్టీలో చేరిన డేరంగులకు టికెట్ ఇచ్చారని అసలు సిసలు కాషాయ కార్యకర్తలు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి బండిని పక్కదారి పట్టించి కోటిన్నర రూపాయలకు టికెట్ అమ్ముకున్నాడని కాషాయ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. మూడు రోజుల క్రితం చింతల రాంచంద్రారెడ్డి టికెట్ కోసం రూ.కోటిన్నర తీసుకున్నారనే అర్థం వచ్చేలా శంకర్‌ప్రసాద్ అనే బీజేపీ కార్యకర్త తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం కాషాయ పార్టీలో కలకలం రేపింది..
ఈ మేరకు బీజేపీలోని ఇరు వర్గాల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే జరిగింది. తాజాగా మరికొన్ని వాట్సప్ గ్రూపుల్లో ఓ బీజేపీ కార్యకర్త రాసిన లేఖ కాషాయపార్టీలో మరింత రచ్చ రేపింది. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన వారిని విస్మరించి కొత్తగా వచ్చిన వ్యక్తికి టికెట్ ఇచ్చారని ఆ కార్యకర్త ఆరోపించాడు. ఇద్దరు పిల్లల నిబంధన ఉల్లంఘించిన విషయం ముందే తెలిసినా… చింతల రాంచంద్రారెడ్డి పట్టించుకోకుండా డేరంగులకు కోటిన్నరకు టికెట్ అమ్ముకుని, పార్టీ పరువును రచ్చకీడ్చారంటూ లేఖలో విమర్శలు చేయడం బీజేపీ నేతలకు షాక్ ఇచ్చింది. ఓ వైపు తమ కార్పొరేటర్‌పై అనర్హత వేటు పడుతుందనే ఆందోళనలో ఉన్న బండి బ్యాచ్‌కు సొంత పార్టీ కార్యకర్తల మధ్య చోటు చేసుకుంటున్న వాట్సాప్ వార్ ఎక్కడికి దారితీస్తుందోనని టెన్షన్ పట్టుకుంది. ఒక్క జూబ్లిహిల్స్ డివిజన్‌లోనే కాదు..గ్రేటర్‌లో చాలా డివిజన్లలో పాత నేతలను కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన కొత్త నేతలకు బండి టికెట్లు ఇచ్చాడు. ఈ క్రమంలో బీజేపీలో కొత్త కార్పొరేటర్లకు, పాత కాషాయ నేతల మధ్య వర్గ విబేధాలు భగ్గుమంటున్నాయంట.. దాదాపు అన్ని డివిజన్లలో ఇదే పరిస్థితి. ఇక బండికి తెలియకుండానే చింతల రామచంద్రారెడ్డి కార్పొరేటర్ టికెట్‌ను కోటిన్నరకు అమ్ముకునే సాహసం చేస్తారా..ఈ కోటిన్నరలో బండికి ఎంత ముట్టిందో అని కాషాయ పార్టీలోని మరో వర్గం వాట్సాప్ గ్రూపులలో పోస్టులు పెడుతుందంట..మొత్తంగా గ్రేటర్ బీజేపీ కార్యకర్తల మధ్య జరుగుతున్న సోషల్ మీడియా వార్ బండి సంజయ్‌కు తలనొప్పిగా మారింది. పార్టీలో అంతర్గత కలహాలను ఎలా అరికట్టాలో తెలియక బండితో సహా బీజేపీ అగ్రనేతలు తలలు పట్టుకుంటున్నారంట.

