తెలుగులో మంచు మనోజ్ నటించిన రాజుభాయ్ అనే చిత్రానికి కథను అందించిన మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా తెరకెక్కిన చిత్రం డిటెక్టివ్. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చింది. తమిళనాట ఘనవిజయం సాధించిన ఈ సినిమా తెలుగ ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా చూద్దాం..
కథ:
దివాకర్ అనే వ్యక్తి తన కొడుకుతో టెర్రస్ మీద ఉండగా పిడుగు పడుతుంది. దీంతో తండ్రీకొడుకులు అక్కడిక్కడే చనిపోతారు. మరోవైపు సినిమా చూడడానికి థియేటర్‌కు వెళ్లిన ఓ పోలీస్ ఆఫీసర్‌కు ఏదో చీమ కుట్టినట్లుగా అనిపిస్తుంది. అలా అనిపించిన కొద్ది గంటల్లోనే ఆయన చనిపోతాడు. ఇది ఇలా ఉండగా అద్వైత భూషణ్(విశాల్) అనే డిటెక్టివ్ దగ్గరకి ఓ చిన్న పిల్లాడు వస్తాడు. తన కుక్క చనిపోయిందని దాని శరీరంలో బుల్లెట్ దొరికిందని.. దాన్ని ఎవరు చంపారో తెలుసుకోవాలని అడుగుతాడు. ఈ కేసును టేకప్ చేసిన డిటెక్టివ్ మొదట్లో కొన్ని రాంగ్ స్టెప్స్ వేసినప్పటికీ తరువాత కుక్క చావు వెనుక పెద్ద స్టోరీ ఉందని తెలుసుకుంటాడు. ఏంటా స్టోరీ..? హత్యల వెనక ఉన్న మిస్టరీని అద్వైత ఎలా చేదించాడనేదే సినిమా కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ కథ, స్క్రీన్‌ప్లే, నేపథ్య సంగీతం. విశాల్ కి ఇది కొత్త పాత్ర. చాలా సెటీల్డ్‌గా చేశాడు. తన నటన కూడా నచ్చుతుంది. అను ఇమ్మాన్యుయేల్‌ది చిన్న పాత్రే. అమాయకంగా కనిపించింది. అద్వైత స్నేహితుడిగా ప్రసన్న పాత్ర గుర్తిండిపోతుంది. ఆండ్రియా ఓ మినీ విలన్‌గా నటించింది. మిగిలిన వారంతా తమిళ నటులే. వారి వారి పాత్రల్లో ఇమిడిపోయారు.
మైనస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ ఓ జోనర్‌కే పరిమితం అవ్వడం. హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ ది చాలా చిన్న పాత్ర. ఈ మాత్రం దానికి హీరోయిన్ ఎందుకు అనిపిస్తుంది.చిత్ర కథ రొటీన్‌గా లాజిక్కులు లేకుండా ఫ్లాట్ సాగడం ప్రీ క్లైమాక్స్ ముందు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతాయి. క్లైమాక్స్‌లో మంగళూరుకు సమీపంలోని దట్టమైన అడవుల్లో తీసిన యాక్షన్ సీన్లు కొంత ఆసక్తికరంగా ఉన్నాయని అనిపించినా ఆ సంతోషం ఎక్కువ సేపు నిలువదు. ఎందుకంటే చాలా రొటీన్‌గా క్లైమాక్స్ ముగియడంతో ప్రేక్షకుడు కొత్తదనం ఏమీ కనిపించదు.
సాంకేతిక విభాగం:
టెక్నికల్ టీమ్ సపోర్ట్ ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. పాటల్లేవు. కానీ నేపథ్య సంగీతం బాగా కుదిరింది. డిటెక్టివ్ సినిమా చూస్తున్నామన్న మూడ్ ని నేపథ్య సంగీతం బాగా క్రియేట్ చేసింది. కథ, స్క్రీన్‌ప్లే విభాగాల్లో మిస్కిన్ ప్రతిభ కనిపిస్తుంది. డబ్బింగ్ సినిమా అయినా ఆ భావన రాదు. తెలుగు సినిమాలానే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
మర్డర్ మిస్టరీ ఆధారంగా తెరకెక్కిన సినిమా డిటెక్విట్. కథ,కథనం సినిమాకు ప్లస్ పాయింట్ కాగా స్లో నేరేషన్,రోటిన్ కథనం సినిమాకు మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా డిటెక్టివ్‌తో విశాల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడనే చెప్పాలి.
విడుదల తేదీ:10/11/2017
రేటింగ్:2.5/5
నటీనటులు: విశాల్ ,ప్రసన్న
సంగీతం: అరోల్ కోరెల్లి
నిర్మాత: విశాల్
దర్శకత్వం: మిస్కిన్