ఐపీఎల్ 2020లో భాగంగా మరో ఆసక్తికర మ్యాచ్ జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్ కతా నైట్ రైడర్స్ పోరాడి ఓడింది. 229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ గెలుపు కోసం చివరి వరకు పోరాడి ఓడింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 210 పరుగులు చేసి 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా ధాటిగా బ్యాటింగ్ ఆరంభించింది. రెండో ఓవర్‌లోనే వికెట్ కొల్పోయిన శుభ్ మన్ గిల్,నితీశ్ రాణా ధాటిగా ఆడారు. ముఖ్యంగా పవర్ ప్లేను పూర్తిగా సద్వినియోగం చేసుకుని భారీగా పరుగులు రాబట్టారు. అయితే ఈ క్రమంలో గిల్ 28, రసెల్ 13 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టగా నితీశ్ రాణా 58 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన మోర్గాన్, తిరుపతి ధాటిగా ఆడారు. ఫోర్లు,సిక్సర్లతో కోల్ కతా బౌలర్లపై విరుచుకపడ్డారు. మోర్గాన్ 18 బంతుల్లో 5 సిక్స్‌లతో 44 పరుగులు చేసి నోర్టజే బౌలింగ్‌లో వెనుదిరుగగా తిరుపతి 16 బంతుల్లో 3 సిక్స్‌లు,3 ఫోర్లతో 36 పరుగులు చేసి ఔటయ్యారు. డీసీ బౌలర్లలో నోర్టజే 3,హర్షల్ పటేల్ 2,రబాడ,స్టాయినిస్,మిశ్రా తలో వికెట్ తీశారు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(88 నాటౌట్: 38 బంతుల్లో 7ఫోర్లు, 6సిక్సర్లు ), పృథ్వీ షా(66: 41 బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సర్లు ) మెరుపు అర్ధశతకాలతో రాణించారు. రిషబ్ పంత్(38: 17 బంతుల్లో 5ఫోర్లు,సిక్స్ ) హిట్టింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో ఢిల్లీ 4 వికెట్లకు 228 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో ఆండ్రూ రస్సెల్(2/29) ఒక్కడే ఢిల్లీని కట్టడి చేశాడు. మిగతా బౌలర్లందరూ ప్రతీ ఓవర్‌లో 12కు పైగా రన్స్ సమర్పించుకున్నారు.