దేశంలో కరోనా కట్టడి కోసం భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకాకు కేంద్ర ప్రభుత్వం కీలక అనుమతులు ఇచ్చింది. దేశీయంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాను ఇకపై పిల్లలకు కూడా వినియోగించనున్నారు. 2 నుంచి 18 ఏళ్ల లోపు వారికి కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి కేంద్ర నిపుణుల కమిటీ పచ్చజెండా ఊపింది. కొవాగ్జిన్ సృష్టికర్త భారత్ బయోటెక్ సెప్టెంబరు మాసంలో పిల్లలపై ఫేజ్-2, ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. దీనికి సంబంధించిన డేటాను పరిశీలించిన కేంద్ర నిపుణుల కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపింది.
లోతైన పరిశీలన, సంప్రదింపుల అనంతరం అత్యవసర పరిస్థితుల్లో కొవాగ్జిన్ నియంత్రిత వినియోగానికి అనుమతి ఇస్తున్నట్టు కమిటీ తెలిపింది. మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేసింది. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ను 28 రోజుల గ్యాప్‌తో రెండు డోసులుగా ఇచ్చే అవకాశం ఉంది. 18 ఏళ్లు పైబడిన వారికి 4 నుంచి 6 వారాల గ్యాప్‌లో రెండు డోసుల వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇంతకుముందు, 12 ఏళ్లు, ఆ పైబడిన వారి కోసం జైకోవ్-డికి డ్రగ్స్ రెగ్యులేటర్ అనుమతి ఇచ్చినప్పటికీ, సరఫరా ఇంకా మొదలుకాలేదు.