గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబుకు కేంద్రం అరుదైన అవార్డు అందించి ఆయన త్యాగాన్ని గౌరవించింది. ఆయనకు మహా వీర చక్ర అవార్డును అందించనున్నట్లు దేశ రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. రేపు రిపబ్లిక్ డే సందర్భంగా ఆయనకు ఈ అవార్డును అందించనున్నారు. గతేడాది ఏడాది జూన్ 15వ తేదీన లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద గల గాల్వన్ వ్యాలీలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జవాన్లు జరిపిన దాడిలో కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.
ఈ ఘర్షణల్లో ఆయనతో పాటు 20 మంది అమరులు అయ్యారు. ఆయనతో పాటు సిపాయ్ ఓఝా, హవల్దార్ పళనిలకు అత్యుత్తమ గ్యాలంట్రీ అవార్డులను అందజేస్తారని తెలుస్తోంది. గాల్వాన్ ఘటనలో చైనా బలగాలను తరిమికొట్టడంలో, వారి దురాక్రమణను నిరోధించడంలో కల్నల్ సంతోష్ బాబు వీరోచితంగా పోరాడారని, చివరికి ప్రాణాలను సైతం వదిలారని ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు.