భూ రికార్డుల నిర్వహణలో రైతులు ఎవరికీ ఒక్కరూపాయి కూడా ఇవ్వకుండా ఉండే విధానాన్ని ఖరారు చేశారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్ లో రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్ భూ రికార్డుల సమగ్ర నిర్వహణకు వచ్చే నెలలో స్పెషల్ డ్రైవ్ చేపడతామని స్పష్టం చేశారు. రైతు సంఘాల ఏర్పాటు కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు సీఎం.
రాష్ట్రంలోని వ్యవసాయ భూముల రికార్డులన్నీ ఈ స్పెషల్ డ్రైవ్ లనే సరిచేస్తారు. ప్రతీ ఇంచు భూమిపై ఖచ్చితమైన వివరాలుండేలా చూస్తారు. యాజమాన్య హక్కులు ఎవరివనేది కచ్చితంగా తేలుస్తారు. తెలంగాణలో భూమి వివాదాలే ఉండని పరిస్థితి ఉండాలని.. అధికారులకు చెప్పారు. భూరికార్డుల స్పెషల్ డ్రైవ్ కోసం అవసరమైతే.. 15వేల మంది నిరుద్యోగ యువకులను.. నెలకు 20వేల వేతనం ఇచ్చి పనిచేయించుకోవాలని చెప్పారు.
రైతు సంఘాల ఏర్పాటు, రికార్డుల స్పెషల్ డ్రైవ్ మీద అవగాహన కల్పించేందుకు.. కొద్దిరోజుల్ల హైదరాబాద్ ల సదస్సు ఏర్పాటు చేస్తమన్నరు సీఎం. సదస్సుకు అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులను పిలుస్తమని చెప్పారు. ఏదేమైనా రైతులకు శాశ్వత ప్రాతిపదికన మేలు చేసే కార్యక్రమాలు చేస్తమన్నారు.
వచ్చే ఏడాది నుంచి ఎకరానికి రూ.8 వేల పెట్టుబడి అందిస్తాం. గిట్టుబాటు ధరల కోసం రైతు సంఘాలను ఏర్పాటు చేస్తున్నాం. వీటన్నింటి ఫలితంగా రాష్ట్రంలో రైతుల బతుకు బాగుపడుతుందని నమ్ముతున్నా. ఇవన్నీ అమలై.. ఓ ఐదేళ్లు గడిచాక రైతు జీవితాల్లో ఎంతో మార్పు వస్తుంది. బ్యాంకులు రైతుల ఇళ్ల ముందు నిలబడి అప్పులిస్తాం అనే పరిస్థితి వస్తుంది. ఇది నా కల. తప్పక నిజమవుతుందన్నారు. తెలంగాణ సాధన ఫలితాలు రైతులకందాలి. జీడీపీ లెక్కలు, ఆర్థికవేత్తల అంచనాలు నాకవసరం లేదు. వ్యవసాయరంగం బాగుండాలనేదే నా లెక్క. అందుకే ఖర్చు గురించి ఆలోచించకుండా రైతుకు ఏం కావాలంటే అదే చేసుకుపోతున్నం’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.
ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒకటి చొప్పున గ్రామ రైతు సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం. వ్యవసాయాధికారులు గ్రామాల్లో ఇప్పటికే రైతు సమగ్ర సర్వేను పూర్తి చేసినందున, ఆ వివరాల ఆధారంగా వ్యవసాయ భూమి కలిగిన ప్రతీ రైతును సభ్యుడిగా చేర్చి గ్రామ సంఘాన్ని ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ రైతు సంఘానికి ప్రాతినిధ్యం వహించేందుకు 11 మంది సభ్యులతో గ్రామ రైతు సమన్వయ సమితిని ప్రభుత్వం నియమిస్తుంది. ఈ సమితిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా రైతులకు ప్రాతినిధ్యం ఉండేలా చూడాలన్నారు సీఎం.