ఏడాదిగా రైతులను దగా చేసి, రైతు పండుగ పేరిట విజయోత్సవాలు జరపడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతు సంక్షేమం కోసం 54,280 ఖర్చు చేసినట్లు చెప్పుకోవడం సిగ్గు చేటు అని…అందులో రూ. 27,486 కోట్లు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం ఉన్నా ఖర్చు చేయాల్సిందేనన్నారు.
రైతులకు బాకీ పడ్డ రూ. 40,800 కోట్లతో పాటు, ఈ రబీకి ఇవ్వాల్సిన రైతు భరోసా కూడా వెంటనే విడుదల చేసి పండుగ చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఏడాది పాలనలో రైతులను విజయవంతంగా దగా చేసినందుకు రైతు పండుగ అంటూ మూడు రోజుల విజయోత్సవాలు చేస్తున్నావా రేవంత్ రెడ్డి?, గొప్పగా చెప్పిన వరంగల్ రైతు డిక్లరేషన్ లోని 9 హామీల్లో ఒక్కటీ అమలు చేయనందుకు పండుగ చేస్తున్నావా రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు.
రుణమాఫీ ఎగ్గొట్టి, రైతు భరోసా బోగస్ చేసి, కనీస మద్దతు ధరకు పంట కొనుగోలు చేయకుండా రైతులను ఏడ్పిస్తున్నందుకు చేస్తున్నావా రేవంత్ రెడ్డి?, మీ ఏడాది దుర్మార్గ పాలనలో 563 మంది రైతులు ప్రాణాలు కోల్పోయినందుకు పండుగ చేస్తున్నావా రేవంత్ రెడ్డి?, చెప్పింది కొండంత, చేసింది గోరంత. ఎన్నికల ప్రచారంలో రైతులను మభ్య పెట్టావు. అధికారంలోకి వచ్చాక నిండా ముంచావు అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మీరు ఏం చేసింది? కేసీఆర్ గారు ఇచ్చిన రైతుబంధు పథకానికి ఎగనామం పెట్టారు…నూటొక్క దేవుళ్ల మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేస్తానని మోసం చేశారు. సగం మందికి మొండి చెయ్యి చూపారు అన్నారు. 24 గంటల నాణ్యమైన కరెంటు అందించలేక చేతులెత్తేశారు, పంటలకు మద్దతు ధర లేదు, అన్ని పంటలకు బోనస్ అసలే లేదు. కొనుగోలు కేంద్రాలు లేవు; అది పత్తి అయినా, ధాన్యం అయినా..కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇస్తానన్న భరోసా దిక్కులేదు అన్నారు.
Also Read:Harish:ప్రతిపక్షాల గొంతు నొక్కడం సరికాదు
ఈ ఏడాది పాటు రైతులకు మీరు చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు రైతు పండుగ నిర్వహించడం సిగ్గుచేటు…పైగా, ఏడాది పాలనలో రైతు సంక్షేమం కోసం 54,280 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రచారం చేసుకోవడం నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుగా ఉందన్నారు. రైతు బీమా, ఉచిత విద్యుత్, ధాన్యం కొనుగోళ్ళ కోసం మీరు ఖర్చు చేసినా అని చెప్పిన రూ. 27,486 కోట్లు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నపుడు చేసింది. ఏ ప్రభుత్వం ఉన్నా చేయాల్సి ఉంటుందేనన్నారు.కానీ, కొత్తగా తామేదో రైతులకు చేసినట్లు డబ్బా కొట్టుకోవడం రైతులను మరోసారి మోసం చేయడమే. ఇదేనా కాంగ్రెస్ మార్కు మార్పు? చెప్పాలన్నారు.
మీ మేనిఫెస్టో ప్రకారం రైతులకు పడిన బాకీ…
రుణమాఫీ కింద దాదాపు 14,000 కోట్లు
ఖరీఫ్ రైతు బంధు కింద 7,500 కోట్లు
కౌలు రైతులకు మరో 3,000 కోట్లు
రైతు కూలీలకు 16,00 కోట్లు
అన్ని పంటలకు బోనస్ సుమారు 3,000 కోట్లు
అకాల వర్షాలకు గానూ పంట నష్టం సుమారు 11,700 కోట్లు (కేంద్రానికి రాష్ట్రం పంపిన రిపోర్టు), ఈ ఏడాది కాలంలో మొత్తం రూ. 40,800 కోట్లు రైతులకు బాకీ పడ్డారు అన్నారు. మీకు, మీ పార్టీకి రైతుల సంక్షేమం పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. రైతులకు బాకీ పడ్డ రూ. 40,800 కోట్లతో పాటు, ఈ రబీకి ఇవ్వాల్సిన రైతు భరోసా కూడా వెంటనే విడుదల చేసి పండుగ చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు హరీశ్.

