పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన ‘పబ్ జీ’..!

233
PUBG Addiction

దేశంలో పబ్ జీ గేమ్ వల్ల రోజురోజుకి మృతుల సంఖ్య పెరుగుతోంది. అంతేకాదు ఈ పబ్ జీ పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతోంది. మాములుగా భార్యాభర్తల మధ్య గొడవల కారణంగానో.. భర్త భర్యను పట్టించుకోవడం లేదనో.. హింసిస్తున్నాడనో..అదనపు కట్నం అడుగుతున్నాడనో విడాకులు కోరుతారు భార్యలు. కానీ ఇక్కడ ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. అదేంటనేగా మీ సందేహం. ఇక అసలు విషయానికొస్తే.. తాజాగా భర్త ‘పబ్ జీ’ గేమ్ ఆడవద్దని చెప్పినందుకు ఓ యువతి కోర్టు మెట్లు ఎక్కింది. తన హక్కులను హరిస్తున్న భర్త నుంచి విడాకులు ఇప్పించాలని న్యాయస్థానాన్ని డిమాండ్ చేసింది. దాంతో ఈ విషయం తెలిసిన వారంతా షాక్‌ గురైయ్యారు.

PUBG Addiction

యూఏఈలో ఇటీవల పెళ్లి చేసుకున్న ఓ జంటకు ఈ పరిస్థితి ఎదురైంది. అయితే పెళ్లయిన దగ్గరి నుంచి ఆమె ఫోన్ లో పబ్ జీని విపరీతంగా ఆడటాన్ని గమనించిన భర్త.. దాన్ని మానుకోవాలని సూచించాడు. దీంతో ఒక్కసారిగా సదరు యువతి అగ్గిమీద గుగ్గిలమయింది. ‘నాకు విడాకులు కావాల్సిందే’ అని కోపంతో బుసలు కొట్టింది. ఈ విషయమై పోలీసులు ఏమయిందని ప్రశ్నించగా, తనకు కావాల్సిన వినోదాన్ని ఎంచుకునే హక్కును తన భర్త కాలరాస్తున్నాడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

పబ్ జీ గేమ్ ను తాను కేవలం స్నేహితులు, బంధువులతోనే ఆడతానని స్పష్టం చేసింది. అయితే ఆమెను బాధపెట్టే ఉద్దేశ్యం తనకు లేదనీ, కేవలం పబ్ జీకి బానిస కాకూడదన్న ఉద్దేశంతోనే దూరంగా ఉండాలని కోరానని భర్త వాపోయాడు. ఈ కేసు విచారణకు స్వీకరించిన కోర్టు త్వరలోనే విచారణ జరిపి తీర్పును వెలువరించనుంది. మరి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.