రాష్ట్రంలో కరోనా పరీక్షలపై కేంద్రం ప్రశంసలు..

164
corona

కోవిడ్ మరణాల రేటు జాతీయ సగటుకన్నా రాష్ట్రంలో తక్కువగా ఉన్నందుకు,కోవిడ్ నియంత్రణకు చేపడుతున్న చర్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి అభినందించారు. శనివారం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్, కాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా 12 రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో రాష్ట్రాలలో కోవిడ్ నియంత్రణ కోసం చేపడుతున్న చర్యలపై సంయుక్తంగా వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.

రాష్ట్రంలో కోవిడ్ పరీక్షల సంఖ్య గణనీయంగా పెంచడంతో పాటు అన్ని ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలు, పట్టణ ఆరోగ్యకేంద్రాలు, బస్తీదవాఖానాల్లో టెస్టులు నిర్వహించటం పట్ల కేంద్ర కాబినెట్ కార్యదర్శి మెచ్చుకున్నారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్ డా. ప్రీతి మీనా మరియు ఇతర వైద్య అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ను ఎదుర్కోవటానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉండటంతో పాటు, ఎప్పటికప్పుడు పరిస్ధితులను నిరంతరం సమీక్షిస్తున్నామని, రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం మొదలైందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కేంద్ర క్యాబినెట్ కార్యదర్శికి వివరించారు.

సి.యస్ మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరిస్తూ రాష్ట్రంలో టెస్టుల సంఖ్యను గణనీయంగా పెంచామని లక్షణాలు ఉండి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్‌లో నెగటివ్‌గా రిజల్ట్ వచ్చిన వారికి RTPCR పరీక్షలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని పడకలకు ఆక్సీజన్ సౌకర్యం కల్పించడానికి ప్రత్యేక వ్యూహన్ని అమలు చేస్తున్నామన్నారు. జిల్లాలో కోవిడ్ నియంత్రణకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామన్నారు.