రిలయన్స్ జియోకు పోటీగా ప్రభుత్వ రంగ టెలీకాం సంస్థ బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.కేవలం రూ.149తో రిఛార్జ్ చేస్తే అపరిమితమైన లోకల్,ఎస్టీడీ కాల్స్ నెలరోజులు చేసుకునేలా ఈఆఫర్ తీసుకరాబోతుంది. నూతన సంవత్సర కానుకగా జనవరి 1 నుంచి ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు బీఎస్ఎన్ఎల్ చైర్మన్ అనుపమ్ శ్రీవాత్సవ తెలిపారు. జియో రాకతో టెలీకాం సంస్థలు భారీగా తమ కస్టమర్లను కోల్పోతున్నాయి. దీంతో అవి కూడా ఓ మెట్టు దిగి ధరలను తగ్గించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. డిసెంబర్ 31 వరకు ఇచ్చిన వెల్ కమ్ ఆఫర్‌ను రిలియన్స్ వచ్చే ఏడాది మార్చి వరకూ పొడిగించారు. ఈ ప్రకటనతో టెలీకాం సంస్థల్లో మరోసారి గుబులు మొదలైంది.
జియోకు చెక్ పెట్టేందుకు, కస్టమ్లర సంఖ్యను పెంచుకునేందుకు బీఎస్ఎన్ఎల్ ఈ సరికొత్త ఆఫర్‌ను ప్రవేశపెడుతోందని తెలుస్తోంది. జియోకు కేవలం 4జీ నెట్‌వర్క్ మాత్రమే ఉండగా, బీఎస్ఎన్ఎల్ తనకున్న 2జీ, 3జీ నెట్‌వర్క్‌లలో ఈ ఆఫర్‌ను వెల్లడిస్తే.. ఆ సంస్థకు భారీ సంఖ్యలో కొత్త కస్టమర్లు చేరే అవకాశం ఉంది. మిగతా టెలీకాం సంస్థలు కూడా ఆఫర్లు ప్రకటిస్తున్నప్పటికీ వాటి ధరలు బీఎస్ఎన్ఎల్ కంటే ఎక్కువగా ఉండటం ప్రభుత్వ రంగ సంస్థకు అడ్వాంటేజ్‌గా మారనుంది.
జియో వెల్‌కమ్ ఆఫర్, న్యూ ఇయర్ ఆఫర్ ముగిశాక.. ఆ సంస్థ కూడా వినియోగదారుల నుంచి ఛార్జీలు వసూలు చేస్తుంది. జియో వెల్లడించిన ప్లాన్ల ప్రకారం రూ.149 ప్లాన్‌లో ఆ సంస్థ ఉచిత వాయిస్ కాల్స్ అందిస్తుంది. దీంతోపాటు 28 రోజుల వ్యాలిడిటీతో 300 ఎంబీ డేటా, 100 లోకల్, నేషనల్ ఎస్సెమ్మెస్‌ను కూడా అందించనుంది. కాకపోతే జియో సేవలు 4జీకే పరిమితమనే సంగతి తెలిసిందే. 2014-15లో రూ.8234 కోట్ల నష్టాలను మూటగట్టుకున్న బీఎస్ఎన్ఎల్ 2015-16లో వాటిని రూ.3879 కోట్లకు తగ్గించుకోగలిగింది.