బిగ్‌బాస్‌ గ్రాండ్ ఫినాలేకు అతిథులు వీరే..

65
bb4

ఈరోజుతో బిగ్ బాస్ తెలుగు 4 రియాలిటీ షో ముగియనుంది. మరికాసేపట్లో బిగ్ బాస్ తెలుగు గ్రాండ్ ఫినాలే ప్రారంభం కానుంది. ఇంట్లో మిగిలిన ఐదుగురి సభ్యుల్లో ఎవరు టైటిల్ గెలుస్తారన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం అభిజీత్, అఖిల్, సోహెల్, అరియానా, హారిక టాప్-5లో ఉన్నారు. వీరిలో ఒకరు టైటిల్ విజేతగా నిలుస్తారు.

ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. అనధికారిక పోలింగ్ ప్రకారం.. అభిజీత్ టైటిల్ గెలిచినట్లు తెలిసింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా అఖిల్, సోహెల్, అరియానా, హారిక ఉన్నట్లు సమాచారం. మరి ప్రేక్షకులు ఎవరిని బిగ్‌బాస్ విన్నర్ చేశారో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. ఇక విజేతను ప్రకటించేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేశారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 కంటెస్టెంట్‌లు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చారు. మోనాల్, లాస్య, కల్యాణి, కుమార్ సాయి, స్వాతి, గంగవ్వ, సుజాత, అవినాష్, నోయెల్, దివి, మెహబూబ్, సూర్య కిరణ్, అమ్మరాజశేఖర్ విచ్చేసి.. ఫినాలేలో ఆట పాటలతో అదరగొట్టారు. ఒక్క దేవి నాగవల్లి మాత్రం కనిపించలేదు. అటు టాప్-5 కంటెస్టంట్స్ కుటుంబ సభ్యులు కూడా ఫినాలే కార్యక్రమానికి హాజరయ్యారు. బిగ్ బాస్ సీజన్ 1, 2, 3 విన్నర్‌లను కూడా కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

ఇక ఫినాలే కార్యక్రమాన్ని అంగంరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. తెలుగు సినీ తారలు ఈ కార్యక్రమానికి అతిథులుగా తరలివచ్చి.. స్టేజిపై ఆటపాటలతో సందడి చేశారు. దానికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో టాలీవుడ్ బ్యూటీలు ప్రణిత, లక్ష్మీ రాయ్, మెహ్రీన్‌లు సందడి చేశారు. డ్యాన్స్‌లతో అదరగొట్టారు. బిగ్ బాస్ స్టేజిపై మ్యూజిక్ డైరెక్టర్ కన్సర్ట్ ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతోంది.

ఇక మూవీ డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరోయిన్ మెహ్రీన్ బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లారు. ఇంటి సభ్యులను అనుకరిస్తూ అనిల్ రావిపూడి నవ్వులు పూయించారు. ఇక ”లవ్ స్టోరీ” మూవీ జంట.. నాగ చైతన్య, సాయిపల్లవి కూడా స్పెషల్ గెస్ట్‌లుగా వస్తారని సమాచారం. చివరగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నారు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్‌కు తన చేతుల మీదుగా ట్రోఫీతో పాటు క్యాష్ అందించనున్నారు.