కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మై ఎన్నిక చేశారు. బెంగళూరులో జరిగిన కర్ణాటక బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆయనను సీఎంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలతోపాటు కేంద్ర పరిశీలకులుగా మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, జీ కిషన్‌రెడ్డి హాజరయ్యారు. సీఎం రేసులో కర్ణాటక హోం మంత్రి బసవరాజు బొమ్మై, అరవింద్ బెల్లాడ్, సీటీ రవి ఉన్నారని ప్రచారం జరిగినా చివరకు బసవరాజు బొమ్మైనే బలపరిచారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా బొమ్మై పేరునే సూచించారు. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం బుధవారం ఉండే అవకాశముంది.
లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బసవరాజు బొమ్మై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కుమారుడు. 1998లో జనతాదల్ పార్టీలో చేరడంతో బసవరాజు బొమ్మై రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆయన 1998, 2004లో జనతాదల్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆ తర్వాత 2008లో బీజేపీలో చేరారు. ఇప్పటివరకు ఆయన యెడియూరప్ప మంత్రి వర్గంలో హోంశాఖ మంత్రిగా ఉన్నారు. సోమవారం తన పదవికి రాజీనామా చేసిన యెడియూరప్ప ప్రస్తుతం కర్ణాటక కేర్‌టేకర్ సీఎంగా కొనసాగుతున్నారు.