ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రెండు సినిమాల సక్సెస్ హాలీవుడ్‌ను ఆశ్చర్యపరుస్తున్నది. ఇందులో ఒకటి బాహుబలి 2 కాగా.. మరొకటి దంగల్. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లకుపైగా కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించాయి. గ్లోబల్ రికార్డులు కొల్లగొడుతున్న ‘బాహుబలి 2’ చిత్రం చైనాలో విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని సినీ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమా అక్కడ ఎప్పుడు విడుదలవుతోందన్న విషయం మాత్రం ప్రకటించలేదు.
దంగల్ నిర్మాతలు బాహుబలి 2 విడుదల తరువాత అంటే మే 05న దంగల్ మూవీని చైనాలో 9000 వేల స్క్రీన్స్‌పై రిలీజ్ చేశారు. ఇప్పటివరకు రూ.778 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తొలి హిందీ చిత్రంగా పేరుగాంచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1471 కోట్లు రాబట్టింది.
చైనాలో బాహుబలి-2 విడుదలపై అనేక సందిగ్ధతలు నెలకొన్నాయి. కానీ, వాటన్నింటికీ చెక్ పెడుతూ బాహుబలి నిర్మాతలు చైనాలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించేశారు. అయితే.. ఎప్పుడు విడుదల చేసేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చైనాలో సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ట్వీట్ చేశారు తరణ్ ఆదర్శ్. ‘బాహుబలి 2’ వసూళ్లు ఇప్పటికే రూ.1600 కోట్లకు చేరిందనే టాక్ కూడా వస్తోంది.. కాగా, కలెక్షన్ల పరంగా, సినిమా సాంకేతిక పరిజ్ఞానం పరంగా కొత్త ప్రమాణాలను నిర్దేశించిన బాహుబలి-2.. చైనాలోనూ వసూళ్ల వరద పారించడం ఖాయమనే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. వారి మాటే నిజమైతే రూ.2000 కోట్ల క్లబ్‌లో బాహుబలి-2 చేరడం ఖాయం.