కోహ్లి మరో ట్రంప్‌..!

141
Australian media calls Kohli is Trump

ఆస్ట్రేలియన్ మీడియా మ‌రోసారి హ‌ద్దు దాటింది. ప్ర‌త్య‌ర్థి టీమ్స్‌పై లేనిపోని ఆరోప‌ణ‌లు చేసే అల‌వాటున్న అక్క‌డి మీడియా.. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసింది. విరాట్ కోహ్లిని క్రీడా ప్ర‌పంచంలో డొనాల్డ్ ట్రంప్‌గా అభివ‌ర్ణించింది డైలీ టెలిగ్రాఫ్ అనే ప‌త్రిక‌. త‌న త‌ప్పులు క‌ప్పిపుచ్చుకోవ‌డానికి ట్రంప్‌లాగే కోహ్లి కూడా మీడియానే నిందిస్తున్నాడ‌ని ఆ ప‌త్రిక అభిప్రాయ‌ప‌డింది.

కెప్టెన్‌ స్మిత్‌, ఆస్ట్రేలియా జట్టు గురించి కోహ్లి చాలా హీనంగా మాట్లాడాడని కథనాన్ని ప్రచురించింది.  ఆస్ట్రేలియన్లు మోసగాళ్లని ఆరోపించిన అతడు.. అందుకు ఎలాంటి ఆధారాలు చూపలేదని, క్షమాపణలు కూడా చెప్పలేదని పేర్కొంది. ఆసీస్‌ ఆటగాళ్ల తమ ఫిజియో ప్యాట్రిక్‌ ఫర్హత్‌ను అగౌరవపరిచారన్న కోహ్లి ఆరోపణలను ఆసీస్‌ ఆటగాళ్లు స్మిత్‌, వార్నర్‌ తిరస్కరించారని ఆ పత్రిక తెలిపింది.

కోహ్లిపై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని తెలిపింది. క్రీడా స్ఫూర్తి అధికారికంగా చచ్చిపోయిందని కోహ్లి నిరూపించాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించడంలో కెప్టెన్‌ ఆదర్శంగా నిలవాలి. కానీ కోహ్లి క్రీడాస్ఫూర్తిని తుంగలోకి తొక్కుతుంటే ఐసీసీ చూస్తూ ఉరుకుంది. గతవారం క్రికెట్‌ ఆస్ట్రేలియాతో బీసీసీఐ రాజీ కుదుర్చుకున్నా కోహ్లి మాత్రం వెనక్కి తగ్గలేదని తెలిపింది.డీఆర్‌ఎస్‌ ఘటనతో పాటు ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధంతో టెస్టు సిరీస్‌లో భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.