ఆశారాం బాపుకు జీవిత ఖైదు..

275
Asaram sentenced to life in prison
- Advertisement -

16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆధ్యాత్మిక గురువకు ఆశారాం బాపును దోషిగా తేల్చిన జోధ్ పూర్‌ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఇప్పటికే ఈ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆశారాంతో పాటు మరో ఇద్దరిని న్యాయస్ధానం దోషిగా తేల్చింది. గుర్మీత్‌ బాబాపై తీర్పు నేపథ్యంలో చోటుచేసుకున్న అల్లర్లను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. జోధ్‌పూర్‌ జైలు సహా రాజస్థాన్‌, గుజరాత్‌, హరియాణా రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

2013లో పదహారేళ్ల అమ్మాయి జోధ్‌పూర్‌లోని ఆశ్రమంలో ఆశారాం తనపై లైంగిక దాడి చేశారంటూ ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.అమ్మాయికి పట్టిన దెయ్యాన్ని వదిలిస్తానని మభ్యపెట్టిన ఆశారాం ఆమెపై అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ కేసుతో పాటు ఆశారంపై మొత్తం మూడు అత్యాచార కేసులు నమోదయ్యాయి. కేసు నమోదైనప్పటికీ ఆశారాం బాపూ పోలీసుల ఎదుట హాజరు కాలేదు. పోలీసులకు, ఆశారాం అనుచరులకు మధ్య తీవ్రమైన ఘర్షణలు కూడా జరిగాయి.

ఆశారాంకు బెయిల్‌ ఇవ్వకపోతే చంపేస్తామంటూ కేసును విచారించిన న్యాయమూర్తిని కూడా బెదిరించారు. దీంతో సుప్రీంకోర్టులో కూడా అతనికి బెయిల్‌ లభించలేదు. ఈ కేసులో ఐదుగురు నిందితుల్లో ఇద్దరిని నిర్దోషులుగా పేర్కొనగా మరో ఇద్దరికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 2013 సెప్టెంబరు 1న ఆశారాంను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్‌ 7నే వాదనలు పూర్తికాగా…ఇవాళ తీర్పును వెలువరించారు.

- Advertisement -