రివ్యూ: అరణ్య

1103
aaranya
- Advertisement -

దేశవ్యాప్తంగా పలు భాషల్లో నటిస్తూ విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు వెర్స‌టైల్ హీరో రానా దగ్గుబాటి. ఆయన ప్రధాన పాత్ర పోషించిన చిత్రం అరణ్య. ప్రభు సాల్మోన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాలో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రీయా పింగోల్కర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈరోస్‌ ఇంటర్‌నేషనల్‌ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చింది. మరి అరణ్య మూవీతో రానా ఆకట్టుకున్నాడా లేదా చూద్దాం…

కథ :

గజేంద్ర భూపతి తనకు చెందిన వందల ఎకరాల భూభాగాన్ని అటవీ ప్రాంతంగా మార్చి ప్రభుత్వానికి అప్పగిస్తాడు. దానిని ధారాదత్తం చేసే అధికారం ప్రభుత్వానికి సైతం లేకుండా వీలునామా రాస్తాడు. గజేంద్ర భూపతి వారసుడైన నరేంద్ర భూపతి (రానా) ఆ భూమిని కాపాడటమే కాకుండా ఆ ప్రాంతంలో లక్షల మొక్కల్ని నాటి… అందమైన వనంగా దానిని దీర్చిదిద్ది..వన్య ప్రాణులను కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. ఈ భూములపై మంత్రి కనకమేడల రాజగోపాలం (అనంత మహదేవన్) కన్ను పడుతుంది. అడ్డుగా నిలిచిన అరణ్యను జైలుకు పంపుతాడు. తర్వాత ప్లాన్ ప్రకారం తాను అనుకున్నది చేస్తాడు రాజగోపాలం. సీన్ కట్ చేస్తే రానా తన భూమిని ఎలా కాపాడుకున్నాడు..?వన్యప్రాణులను ఎలా సంరక్షించాడన్నదే కథ.

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ కథ,రానా నటన, సంగీతం,సినిమాటోగ్రఫీ. రానా నటన సినిమాకు హైలైట్. తన పాత్రకు వందశాతం న్యాయం చేశారు. బాలీవుడ్ నటదంపతులు సచిన్, సుప్రియ కుమార్తె శ్రియా పిల్గాంకర్ ఇందులో జర్నలిస్ట్ గా నటించింది. అలానే లేడీ నక్సలైట్ పాత్రను జోయా హుస్సేన్ పోషించింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో తీయడంతో అధిక ప్రాధాన్యం పరభాషా నటులకే దర్శకుడు ప్రభు సాల్మన్ ఇచ్చాడు.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ నత్తనడకలా సాగే కథనం. కథను ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో దర్శకుడు ప్రభు సాల్మన్ విఫలమయ్యాడు. కథను ఎంపిక చేసుకోవడంలో చూపిన శ్రద్ధ, దానిని వెండితెరపై ఆవిష్కరించడంలో విఫలమయ్యాడు.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్ . వనమాలి రాసిన పాటలు, మాటలు అర్థవంతంగా ఉన్నాయి. శంతను మొయిత్రా సంగీతం హాయిగా ఉంది. రసూల్ పోకుట్టి అంతర్జాతీయ స్థాయిలో సౌండ్‌ డిజైన్ చేశాడు. ఎ.ఆర్. అశోక్ కుమార్ సినిమాటోగ్రఫీ , ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

తీర్పు:

అస్సాంలోని కజిరంగ నేషనల్ పార్క్ ను స్ఫూర్తిగా తీసుకుని తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. అటవీభూమిని కాపాడటం, పర్యావరణ హితానికి కారణమయ్యే ఏనుగుల మనుగడ కోసం పోరాటం చేస్తాడు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరిలోనూ అరణ్య ఆదర్శం పట్ల గొప్ప గౌరవం కలుగుతుంది.

విడుదల తేదీ:26/03/2021
రేటింగ్ : 2. 5 / 5
నటీనటులు: రానా
సంగీతం:శంతను మొయిత్రా
నిర్మాత:ఈరోస్‌ ఇంటర్‌నేషనల్‌
దర్శకుడు: ప్రభు సాల్మన్

- Advertisement -