తమిళ రాజకీయాల్లో నాటి నుంచి నేటి దాకా నేతల వ్యక్తిగత జీవితం, సామాజిక జీవితంపై బహిరంగ విమర్శలు రావటం సర్వసాధారణం. తమిళ ప్రజల ‘అమ్మ’గా పేరు గడించిన జయ దీనికి మినహాయింపేమీ కాదు. ఆమె మృతి చెంది ఏడాది అవుతున్నా ఆమె వ్యక్తిగత జీవితంపై రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన మంజుల అలియాస్ అమృత తానే జయ కుమార్తెనంటూ ప్రకటించి కలకలం రేపారు. డీఎన్‌ఏ పరీక్షలకు కూడా సిద్ధమని ఏకంగా సుప్రీంకోర్టునే ఆశ్రయించారు.
తాను జయలలిత కుమార్తెననే నిజం ఇటీవలే తనకూ తెలిసిందని, దానిని ధ్రువీకరించుకున్న తర్వాతే తెరపైకి వచ్చానని బెంగళూరుకు చెందిన అమృత తెలిపారు. దీని గురించి ఓ తమిళ టీవీ ఛానెల్‌కు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. తన పెంపుడు తల్లి లలిత 2015లో మరణించగా… అప్పటివరకు ఆమె కుమార్తెనేనని భావించానని తెలిపారు. పెంపుడు తండ్రి సారథి 2017 మార్చిలో చనిపోయే సమయంలో తాను జయలలిత కుమార్తెనని చెప్పడంతో వెంటనే నిర్ధారించుకోలేకపోయానని చెప్పారు. తర్వాత తన బంధువులను విచారించగా జయలలితకు కుమార్తె ఉన్న విషయం నిజమేనని, అది తానేనని చెప్పడంతో ప్రస్తుతం దానిని బహిర్గతం చేశానని పేర్కొన్నారు.
1996 జూన్ 6న తొలిసారిగా జయలలితను చూశానని, అప్పుడు ఆమె అధికారం కోల్పోయిన మానసిక ఒత్తిడిలో ఉన్నారని అమృత తెలిపారు. తనను చూసిన వెంటనే ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకున్నారని, అది తనకు దిగ్భ్రాంతి కలిగించిందని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమెను పలుమార్లు కలిశానని తెలిపారు. ఒకే పళ్లెంలో తిన్నామని, ఒకే పడకపై నిద్రించామని వివరించారు. జయలలితను చూసేందుకు తాను సచివాలయానికి వెళ్లిన ప్రతిసారి ‘నువ్వు ఎక్కడైనా ఉండు. ప్రాణాలతో ఉంటే చాలు’ అనేవారని, ఆమె ఆస్పత్రిలో చేరడానికి ముందుగా ఫోన్ చేసి చూడటానికి వస్తున్నట్టు చెబితే వద్దని వారించారని వివరించారు. ఇంట్లో ఉండబోనని తెలిపారని పేర్కొన్నారు. అయినా తాను పోయెస్‌గార్డెన్‌లోని వేదనిలయానికి వెళ్లగా ఆమె లేరని చెప్పారని, తర్వాత విచారించగా ఆమెకు ఇంట్లోనే వైద్యచికిత్సలు అందిస్తున్నట్టు తెలిసిందని వివరించారు.
జయలలితను పలుమార్లు కలిసినందున దానికి ఆధారంగా సీసీ టీవీ కెమెరాల ఫుటేజీలు ఉండొచ్చని అమృత తెలిపారు. జెడ్ కేటగిరీ రిజిస్ట్రర్‌లోనూ ఈ వివరాలు ఉంటాయని చెప్పారు. జయలలిత సోదరినని, డీఎన్‌ఏ పరీక్షకు సిద్ధమంటూ తన పెంపుడు తల్లి లలిత గతంలో తెరపైకి వచ్చారని, అలాగే తాను కూడా డీఎన్‌ఏ పరీక్ష ద్వారా జయలలిత కుమార్తెనని నిరూపించాల్సి ఉన్నట్టు భావిస్తున్నానని పేర్కొన్నారు. జయలలిత మరణించడానికి ముందుగా స్పృహలో ఉంటే కచ్చితంగా తనతో మాట్లాడి ఉండేవారని తెలిపారు. శశికళ కుటుంబ సభ్యులు తమను జయలలితను కలవకుండా పలుమార్లు అడ్డుకున్నారని పేర్కొన్నారు.