లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడడంతో కొత్త ప్రభుత్వం, మంత్రివర్గ కూర్పుపై ఉహాగానాలు జోరందుకున్నాయి. ఈసారి కేబినెట్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చోటు దక్కించుకునే వారేవరు అనేదానిపై జోరుగా చర్చసాగుతోంది. అపర చాణక్యుడు అమిత్ షాను కేబినెట్లోకి తీసుకోవడం దాదాపుగా ఖాయమని సమాచారం.
ఆర్థిక లేదా రక్షణ శాఖల్లో ఏదో ఒకటి షాకు అప్పగిస్తారని సమాచారం. అయితే హోంమంత్రిగా అద్భుతంగా రాణించి- ఇన్నాళ్లూ మోదీ కేబినెట్‌లో నెంబర్-2గా వెలిగిన రాజ్‌నాథ్‌సింగ్‌ను మార్చరని, ఈసారి కూడా అదే శాఖ ఇస్తారని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. విదేశాంగ శాఖను సుష్మా స్వరాజ్‌కు, పట్టణాభివృద్ధి శాఖను నితిన్‌గడ్కరీకి మళ్లీ కేటాయిస్తారని ఈ వర్గాలు తెలిపాయి.
ఇక ఇన్నాళ్లూ ఆర్థిక శాఖను నిర్వహించిన అరుణ్ జైట్లీ మళ్లీ మంత్రివర్గంలో చేరే అవకాశం లేదు.అనారోగ్య కారణాల వల్ల ఆయన్ని పదవి నుండి తప్పించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఒకవేళ షాకి రక్షణశాఖ మంత్రి అప్పజెబితే ఆర్థికమంత్రి రేసులో పీయూష్ గోయెల్ ఉన్నారు. జైట్లీ అమెరికా వెళ్లినపుడు రెండు సందర్భాల్లో ఆయన ఆర్థికశాఖ బాధ్యతలను నిర్వహించారు. మోడీ విధేయుడిగా పేరున్న ఆయన… చెప్పిన పనిని త్రికరణశుద్ధిగా అమలు చేయడంలో దిట్ట.
ఇక రేసులో వినిపిస్తున్న మరో పేరు నిర్మలా సీతారామన్,అమేథిలో రాహుల్‌గాంధీని ఓడించిన జెయింట్ కిల్లర్ స్మృతీ ఇరానీకి తగిన శాఖతో ప్రతిఫలం దక్కుతుందని కూడా ప్రచారం జరుగుతోంది. ఇక బీజేపీ సిగలో విరిసిన కొత్త కమలం బెంగాల్‌కు తగురీతిన కృతజ్ఞతలు చెప్పేందుకు ఆ రాష్ట్రం నుంచి కూడా గణనీయమైన సంఖ్యలో మంత్రిపదవులకు అవకాశం ఉంటుందని సమాచారం. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతోంది.
మిత్రపక్షాల్లో శివసేన, జేడీ(యు)లకూ కీలక స్థానం లభించనుంది. ఇక ఈసారి మంత్రివర్గంలో యువతకూ పెద్దపీట వేయాలని బీజేపీ నాయకత్వం భావిస్తోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.