కంచి కామకోటి పీఠం 71 వ ఆచార్యులుగా దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేష శర్మ అభిషేక వేడుక శుభ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాభినందనలు తెలియజేశారు. గణేష శర్మ ఋగ్వేద పండితులుగా బాసరలోని జ్ఞాన సరస్వతి దేవి గారికి, తెలంగాణ ప్రాంతానికి ఎలలేని ధార్మిక సేవ చేశారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఋగ్వేదంలోనే కాకుండా యజుర్వేదం, సామవేదం, షడాంగాలు, దశోపనిషత్తుల్లో జగద్గురు పూజ్యశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి కృపతో అపారమైన జ్ఞానార్జన చేశారని గుర్తుచేశారు. సనాతన ధర్మ గురుపరంపరకు, భక్తి తత్వానికి, జ్ఞాన మార్గానికి బాటలు వేసే ఈ వేడుక తెలంగాణ ప్రజలందరికీ మధుర జ్ఞాపకం కాబోతోందని అన్నారు.
మంగళకరమైన అక్షయ తృతీయ రోజున (30 ఏప్రిల్) జరగనున్న ఈ అభిషేక వేడుక సందర్భంగా కంచి కామకోటి పీఠానికి తెలంగాణ ప్రజల తరఫున ముఖ్యమంత్రి ప్రణామాలు తెలియజేశారు. ఈ గురుపరంపర ధర్మాన్ని, జ్ఞానాన్ని, శాంతిని మానవాళికి ఎల్లప్పుడూ అందించాలని ఒక సందేశంలో ఆకాంక్షించారు.
Also Read:అలా అయితే పాకిస్తాన్‌కే వెళ్లండి:పవన్

