మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలి- సీఎం కేసీఆర్

131
- Advertisement -

తెలంగాణ రైతులు వరికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న వేరుశనగ, పత్తి, మినుములు, పెసర్లు, శనగలు వంటి పంటల సాగు ద్వారా పంట మార్పిడి విధానాన్ని ఎంచుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సూచించారు. వరి వంటి ఒకే తరహా పంట వేసి ఇబ్బంది పడే కంటే ఇతర పంటల సాగు మీద కూడా దృష్టి కేంద్రీకరించాలని సీఎం పేర్కొన్నారు. గురువారం జోగులాంబ గద్వాల్ జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి హైదరాబాద్ వెళుతూ ఆకస్మికంగా మార్గమధ్యంలో వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్, కొత్తకోట మండలం విలియం కొండ తండా గ్రామ పంచాయతీ ఫరిధిలోని రైతులు సాగు చేసిన మినుము, వేరుశనగ పంటలను పరిశీలించారు. మొదట రంగాపూర్ దగ్గర ఆగిన సీఎం కేసీఆర్ రోడ్డు నుండి లోపలికి నడుచుకుంటూ వెళ్లి మహేశ్వర్ రెడ్డి అనే రైతు సాగు చేస్తున్న మినుము పంటను, రాములు అనే మరో రైతు సాగు చేస్తున్న వేరుశనగ పంటను పరిశీలించారు.

మినుములు, వేరుశనగ దిగుబడి ఎంత వస్తుంది? మార్కెట్లో ధర ఎంత ఉంది? ఎన్ని తడులు నీళ్లు పెట్టాలి? అని రైతులను వివరాలు అడిగారు సీఎం. మినుములు ఎకరానికి 8 నుండి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుందనీ, ఎంఎస్ పి ధర క్వింటాల్ కు రూ. 6300 ఉండగా, మార్కెట్ లో ధర రూ. 8 వేలకు పైనే ఉందని రైతులు వివరించారు. వేరుశనగ 10 నుండి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందనీ, ఎంఎస్ పి క్వింటాల్ ధర రూ. 5550 ఉండగా, మార్కెట్ లో రూ. 7 వేలకు పైనే ఉందని సీఎంకు వివరించారు. పంటల మార్పిడి వల్ల భూసారం పెరిగి దిగుబడి బాగా వస్తున్నదని తెలిపారు. ఆ తర్వాత కొత్తకోట మండలం విలియం కొండ తండా రోడ్డు వద్ద కళ్ళంలో ఆరబోసిన వరి ధాన్యాన్ని సీఎం పరిశీలించారు. గోకరి వెంకటయ్య అనే రైతు వేరుశనగ పంట దగ్గరికి వెళ్లి పరిశీలించారు. సాగు విధానం, దిగుబడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని వేరుశనగ చెట్లను భూమి నుండి తీసి వేరుశనగ కాయలను స్వయంగా పరిశీలించారు. నీళ్లు, కరెంటు పుష్కలంగా ఉండడంతో పంటల దిగుబడి బాగా పెరిగిందని రైతు వెంకటయ్య సీఎంకు వివరించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ అకస్మాత్తుగా తమ పంట చేలల్లోకి రావడంతో రైతులు, గిరిజనులు సీఎంతో ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, జైపాల్ యాదవ్, పట్నం నరేందర్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి, మాజీ ఎంపీ మందా జగన్నాధం, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు ఉన్నారు.

- Advertisement -