హైదరాబాద్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌

227
kovind
- Advertisement -

భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ త్వరలో హైదరాబాద్ పర్యటించనున్నారు. తన సదరన్ సోజోర్న్ లో భాగంగా ఈనెల 4 వ వారంలో ఆయన పర్యటన ఉంటుందని ప్రభుత్వానికి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి తాత్కాలిక షెడ్యూల్ అందింది. నాలుగు నుంచి ఐదు రోజులపాటు రాంనాథ్ కొవింద్ ఇక్కడి రాష్ట్రపతి నిలయంలో విడిది చేస్తారు. దేశ ప్రథమ పౌరుడికి ఘన స్వాగతం పలికేందుకు సాధారణ పరిపాలన శాఖ ఏర్పాట్లు మొదలుపెట్టింది.

ప్రతిఏడు చలికాలం భారత రాష్ట్రపతి హైదరాబాద్ ను సందర్శించి, ఇక్కడ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం, ఎట్ హోం నిర్వహించడం, అతిథులను కలవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఐతే కోవిడ్ కారణంగా గత ఏడాది రాష్ట్రపతి సదరన్ సోజోర్న్ రద్దయింది. ఈసారి మాత్రం డిసెంబర్ 19 నుంచి 25 వ తేదీల మధ్య ప్రెసిడెంట్ రాంనాథ్ కొవింద్ హైదరాబాద్ కు రానున్నారు. 4 నుంచి 5 రోజులపాటు ఆయన సికిందరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేస్తారు. ఈమేరకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి ప్రభుత్వానికి అధికారిక సమాచారం అందింది. దీంతో రాంనాథ్ కొవింద్ కు ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రోటోకాల్ విభాగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది.

1860 లో నిర్మించిన బొల్లారం రాష్ట్రపతి నిలయాన్ని స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నిజాం నవాబు నుంచి భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. తరవాత దాన్ని రాష్ట్రపతి సచివాలయంగా మార్చింది. ప్రతి చలి కాలం దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ఇక్కడికి రావడం, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనవాయితీగా కొనసాగుతోంది. బొల్లారంలో 90 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన రాష్ట్రపతి నిలయంలో మొత్తం 11 గదులున్నాయి. త్వరలో రాంనాథ్ కొవింద్ హైదరాబాద్ పర్యటించనున్న నేపథ్యంలో తెలంగాణా పోలీస్ ఆక్టోపస్ విభాగం రాష్ట్రపతి నిలయంలో మాక్ డ్రిల్ నిర్వహించింది. ఎలాంటి అనూహ్య పరిణామాలు తలెత్తినా ఎదుర్కొనేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని ఈ కసరత్తు ద్వారా సందేశం ఇచ్చింది. విపత్కర పరిస్థితుల్లో సైతం సమర్థవంతంగా వ్యవహరించే వివిధ విన్యాసాలను మాక్ డ్రిల్లో భాగంగా మెరికల్లాంటి కమెండోస్ ప్రదర్శించారు.

14 వ రాష్ట్రపతిగా రాంనాథ్ కొవింద్ పదవీకాలం జూలై 2022 తో ముగుస్తుంది. అధికారికంగా ఇదే ఆయన చివరి దక్షిణ వింటర్ సోజోర్న్ కూడా అవుతోంది. దీంతో దేశ ప్రథమ పౌరుడికి ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్, నగర ప్రథమ పౌరురాలు, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఇతర మంత్రులు దిండిగల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఘన స్వాగతం పలకనున్నారు.

- Advertisement -