ప్రతిపక్ష నేతగా ఓవైసీ..!

374
akbaruddin owaisi
- Advertisement -

ఓడలు బండ్లు..బండ్లు ఓడలు అవ్వడం అంటే ఇదేనేమో. కాంగ్రెస్‌ ఎల్పీ..టీఆర్ఎస్‌లో విలీనం కావడంతో మజ్లిస్ శాసనసభలో రెండో అతిపెద్దపార్టీగా అవతరించింది. జాతీయపార్టీ కాంగ్రెస్.. రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. పాతబస్తీ కేంద్రంగా రాజకీయ పునాది వేసుకున్న ఎంఐఎం క్రమంగా తన బలాన్ని పెంచుకుంటూ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షపార్టీగా ఎదిగింది.

మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీకి 1927 నవంబర్ 12న బీజం పడింది. అప్ప టి నిజాం నవాబు మీర్ ఉస్తాన్ అలీఖాన్ సలహామేరకు నవాబ్ మహమూద్ నవాజ్‌ఖాన్ ఖిలేదార్..ఉల్మా-ఏ-మషాఖీన్ పార్టీని స్థాపించారు. అదే తర్వాత ఎంఐఎం పార్టీగా అవతరించింది. 1948లో భారత్ సర్కార్ ఎంఐఎం పార్టీని రద్దుచేసింది.

1958లో మజ్లిస్‌ని పునఃస్థాపించారు అబ్దుల్ వాహిద్ ఓవైసీ. ఆయన రాజకీయవారసుడిగా 1975లో సలావుద్దీన్ ఒవైసీ పార్టీ బాధ్యతలు చేపట్టారు. 1960లో ఆయన మల్లేపల్లి వార్డు నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికైన ఓవైసీ…1962లో పత్తర్‌గట్టి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత చార్మినార్, యాకూత్‌పురా నియోజకవర్గాల నుంచి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1984లో హైదరాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందారు ఓవైసీ.

1994లో మజ్లిస్‌లో అంతర్గత తిరుగుబాటు రావడంతో ఒవైసీకి కుడిభుజంగా ఉన్న అమానుల్లాఖాన్ ఆయనపై తిరుగుబాటు చేసి మజ్లిస్ బచావో తహరీఖ్ (ఎంబీటీ)ని స్థాపించారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎంఐఎం ఒక్కసీటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

తర్వాత ఎంబీటీ ప్రభావం తగ్గిపోయి ఎంఐఎం తిరుగులేని రాజకీయశక్తిగా అవతరించింది. 2004లో 5 అసెంబ్లీ స్ధానాలను గెలుపొందిన ఎంఐఎం ప్రస్తుతం 7 అసెంబ్లీ స్ధానాల్లో విజయబావుట ఎగురవేసి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది.ఎంఐఎం నేత అక్బరుద్దీన్ అపోజిషన్ లీడర్ గా ఎన్నికయ్యే అవకాశం ఉంది.

- Advertisement -