కరోనావైరస్ పాకిస్తాన్‌లో విజృంభిస్తోంది. సరైన వైద్య సదుపాయాలు లేక, ఆర్థిక ఇబ్బందులతో అతలాకుతలం అవుతోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ ఓ సరికొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరు దేశాలు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడితే బాగుంటుందని.. తద్వారా వచ్చే నిధులను ఇరు దేశాలు కరోనాపై పోరాటానికి వినియోగించుకోవచ్చని అభిప్రాయపడ్డారు అక్తర్.
తటస్థ వేదికగా దుబాయ్‌లో మ్యాచ్‌లు నిర్వహిస్తే బాగుంటుందని.. ప్రేక్షకులను అనుమతించకుండా టీవీలకు మాత్రమే పరిమితం చేయాలని సూచించాడు. దీనికి భారత్ ముందుకు రావాలని అక్తర్ కోరాడు. అయితే దీనిపై బీసీసీఐ ఇంకా స్పందించలేదు.కానీ భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ స్పందించాడు.
‘క్రికెట్ సిరీస్ అనేది అక్తర్ అభిప్రాయం మాత్రమే. కానీ, మనం ఇప్పుడు విరాళాలు సేకరించాల్సిన అవసరం లేదు. మన దగ్గర డబ్బు ఉంది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అందరూ కలిసి కట్టుగా పనిచేయడమే ఇప్పుడు ముఖ్యం. కరోనా కట్టడి చర్యలపై రాజకీయ నాయకులు ఇప్పటికీ పరస్పరం ఆరోపణలు చేసుకోవడం చూస్తున్నాం.ముందు ఇది ఆగాలి.
ఏదేమైనా కరోనాపై పోరాటానికి బీసీసీఐ ఇప్పటికే భారీ మొత్తం (రూ. 51 కోట్లు) సాయం చేసింది. అవసరమైతే ఇంకా విరాళం ఇచ్చే స్థాయిలో ఉంది. దానికి విరాళాలు సేకరించాల్సిన అవసరం లేదు’ అని కపిల్ దేవ్ పేర్కొన్నాడు. ఈ కరోనా సమయంలో ఐదారునెలల వరకు క్రికెట్ ఆడకపోతేనే మంచిందని కపిల్ దేవ్ స్పష్టం చేశారు.