కలెక్టర్‌గా ప్రేమలో ‘దేవసేన’

348
Anushka As Collector in Bagamathi
- Advertisement -

సినిమా హీరోలు..హీరోయిన్లు తమ నిజజీవితంలో ఏమి కావాలనుకునా కాలేకపోయినా పర్వాలేదు. ఎప్పుడో ఒకప్పుడు అలాంటి ఛాన్స్ వెండి తెరపై వెలిగే అవకాశం వస్తుంది. ఎందుకంటే చాలా మంది హీరోలు..క్యారెక్టర్ ఆర్టిస్టులు ముఖ్యమంత్రులుగా..ప్రధాన మంత్రులుగా నటించారు. ఇక కలెక్టర్..అధికారుల పాత్ర అయితే కొదవే ఉండదు. టాలీవుడ్ లో టాప్ హీరో అన్పించుకున్నాక పోలీసు పాత్ర చేయని వాడు ఉండడు అనటం అతిశయోక్తి కాదేమో. చాలా మంది హీరోయిన్లు కూడా పోలీస్…కలెక్టర్ పాత్రల్లో నటించి మెప్పించారు. ఇప్పుడు ఇదే బాటలో టాలీవుడ్ బ్యూటీ అనుష్క చేరింది.

బాహుబలి కన్ క్లూజన్ తర్వాత అనుష్క మరికొన్ని సినిమాలకు కమిట్ అయింది. అనుష్క ముఖ్యతారగా పిల్ల జమిందార్ ఫేమ్ జి.అశోక్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా భాగమతి. తొలుత ఈ సినిమా చారిత్రక ప్రాధాన్యత ఉన్న చిత్రంగా ప్రచారం జరిగింది. ఇప్పుడు ఇది ప్రేమ కథగా ప్రచారం సాగుతోంది.

ఇందులో అనుష్క కలెక్టర్ గా నటిస్తున్నారు. అయితే తాను ఈ సినిమాలో ఎలాంటి సమస్య ఉన్నా వాటిని పరిష్కరించే సామర్థ్యం కలిగిన ప్రభుత్వ అధికారిగా తెరపై కనిపించనున్నారట. ఇందులో ఓ ప్రభుత్వ అధికారి సమస్యలను పరిష్కడమే కాకుండా.. తనకూ ఓ చక్కని ప్రేమ కథ కూడా ఉందంటున్నాయి యూనిట్ వర్గాలు.

జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ కుమారుడిగా నటించిన ఉన్ని ముకుందన్ దీంట్లో సోషల్ యాక్టివిస్ట్ గా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా వీరిద్దరిలో అనుష్క ఎవరితో ప్రేమలో పడతారన్న విషయం మాత్రం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే మరి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. కొత్త సంవత్సరంలో అనుష్క కొత్తగా కలెక్టర్ పాత్రలో కన్పించనుందట.

- Advertisement -