వీరూ పిల్లలకి సచిన్ పాఠాలు

94
Sachin at Virender Sehwag’s cricket academy

రెండు దశాబ్దాల పాటు క్రికెట్ ప్రపంచాన్ని శాసించి అనేక రికార్డులు కొల్లగొట్టిన లెజెండ్ ఆటగాడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కు అభిమానుల సంఖ్య చాలా ఎక్కువే. సచిన్ బ్యాటింగ్‌ను ఇష్టపడని వారుండరు. కానీ అలాంటి సచిన్‌కు డాషింగ్‌ ఓపెనర్ సెహ్వాగ్‌ బ్యాటింగ్ అంటే ఇష్టమంట. ఈ విషయాన్ని సచిన్ స్వయంగా వెల్లడించారు. దాదాపుగా 10 సంవత్సరాల పాటు క్రికెట్ ఆడిన వీరిద్దరు మంచి స్నేహితులు.

ఇటీవల మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కు చెందిన ఇంటర్నేషనల్ క్రికెట్ స్కూల్ కు వెళ్లిన సచిన్.. అక్కడి విద్యార్థులకు క్లాస్ తీసుకున్నాడు. అపజయాల గురించి ఆలోచన చేయడం మానేయ్యాలని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నాడు. భవిష్యత్తులో ఏమి సాధించాలని అనుకుంటున్నామో దానిపై మాత్రమే దృష్టి పెట్టాలని సూచించాడు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సచిన్ సమాధానాలు చెప్పాడు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి ‘ఓటములను ఎలా ఎదుర్కోవాలి?’ అని అడిగ్గా.. ముందు అపజయాల గురించి ఆలోచించడం మానేయ్యాలని ఆ విద్యార్థికి సచిన్ సలహా ఇచ్చాడు.

గతంలో తాను పరుగులు చేయడంలో ఇబ్బందులు పడ్డప్పుడు తన సోదరుడు తనకు ఇదే సలహాను ఇచ్చాడని సచిన్ పేర్కొన్నాడు. తన కొడుకు, కూతురికి తాను తరుచుగా ఓ మాట చెబుతానని, అదేంటంటే.. మనకు రెండవకాశాలు ఉంటాయని, మొదటిది మనకున్న వాటి గురించి దేవుడికి కృతజ్ఞతలు తెలియజేయడం అయితే, రెండోది జీవితంలో మనకు లేని వాటి గురించి ఫిర్యాదు చేయడమని అన్నాడు. వాటిల్లో ఏది ఎంచుకోవాలో వారి ఇష్టం అని కొడుకు, కూతురితో చెబుతానని సచిన్ అన్నాడు. సచిన్….తన స్కూల్ పిల్లలకు పాఠాలు చెప్పిన వీడియోని వీరూ….సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరలైంది.

sehwag

ఇక ఓపెనింగ్ పెయిర్‌గా సచిన్, సెహ్వాగ్‌లు క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులను నెలకొల్పిన సంగతి తెలిసిందే. వన్డేల్లో వీరిద్దరి ఓపెనింగ్‌ జోడీ 114 ఇన్నింగ్స్‌ల్లో 4,387 పరుగులు చేసి రికార్డు సృష్టించింది.