111 జీవో ఎత్తివేత.. ఇక ఆ భూములు బంగారమే?..

85
- Advertisement -

సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా సంచలన ప్రకటన చేశారు.. 111 జీవోను ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనతో ఇప్పుడు ఆ జీవోపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అసలు 111 జీవో అంటే ఏంటి? అసలు దీని వెనుక ఉన్న కథేంటి? ఎందుకు జీవో ఎత్తివేస్తున్నారు? జీవో ఎత్తివేత వల్ల ఎవరికి ప్రయోజనం? ఎవరికి నష్టం. 111 వన్ జీవో.. ఈ జీవో పరిధిలో దాదాపుగా లక్ష 32వేల ఎకరాల భూమి ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 1,32,000 ఎకరాల్లో విస్తరించి ఉంది జీవో.111. ఏకంగా 84 గ్రామాలు ఈ జీవో పరిధిలోకి వస్తాయి. కొన్ని దశాబ్దాలుగా ఈ గ్రామాల ప్రజలు త్రిబుల్ వన్ ఎత్తివేయాలని ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నారు.

హైదరాబాద్ పట్టణానికి నీరందించే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ను కాపాడేందుకు 1996లో అప్పటి ప్రభుత్వం జీవో 111ను తీసుకువచ్చింది. ఈ జీవో పరిధిలో నిర్మాణాలు చేయడంపై నిషేధం విధించింది. వ్యవసాయం తప్ప ఏ రంగానికి ఇక్కడ భూమి కేటాయింపు చేయకూడదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక త్రిబుల్ వన్ జీవో ఎత్తి వేస్తామంటూ ఎన్నికల హామీలు ఇచ్చాయి రాజకీయ పార్టీలు. దీంతో త్రిబుల్ వన్ జీవో పరిధిలో లావాదేవీలు పెద్ద ఎత్తున పెరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకుల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారుల వరకు చిన్నాపెద్ద అంతా త్రిబుల్ వన్ జీవోలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు. వెంచర్లు నిర్మాణాలతో రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ భారీగా జరుగుతుంది. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం కూడా జీవో ఎత్తివేయాలని ఉద్దేశంతోనే ఉంది. ఈ అంశం తెరపైకి వచ్చిన ప్రతిసారి రంగారెడ్డి ప్రజలంతా ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు.

హైకోర్టు కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం వేసిన కమిటీ రిపోర్టు అడగడంతో.. సీఎం కేసీఆర్ త్రిబుల్ వన్ జీవోపై సమీక్ష జరిపారు. రిపోర్టు కోర్టుకు అందించేందుకు కొంత సమయం కావాలని అడగాలని నిర్ణయించుకుంది. అంతేకాకుండా జీవో పరిధిలో మరింత ఉండేలా, జంట జలాశయాలు కాలుష్యం బారిన పడకుండా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ నగర వాతావరణ సమతుల్యతను పెంచేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. మొత్తానికి సీఎం కేసీఆర్‌ 111 జీవోను ఎత్తివేస్తామని తీసుకున్న సంచలన నిర్ణయంతో ఆ జీవో పరిధిలో ఉన్న భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. దీంతో ఇన్నాళ్లు 111 జీవోను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్న వారంతా సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -