ఈ సినిమా పెద్ద విజ‌యం సాధిస్తుంది- ఎన్టీఆర్‌

191
Young Tiger NTR
- Advertisement -

పంజా వైష్ణ‌వ్ తేజ్‌, కృతి శెట్టి జంట‌గా సుకుమార్ రైటింగ్స్ భాగ‌స్వామ్యంతో మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న చిత్రం ‘ఉప్పెన‌’. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఫిబ్ర‌వ‌రి 12న థియేట‌ర్ల‌లో ఈ చిత్రం విడుద‌ల‌వుతోంది. గురువారం ఉప్పెన ట్రైల‌ర్‌ను యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌న కార్యాల‌యంలో రిలీజ్ చేశారు. ట్రైల‌ర్ సూప‌ర్బ్‌గా ఉందంటూ ప్ర‌శంసించారు. సినిమా కూడా అంతే బాగా ఉంటుంద‌ని ఆశిస్తున్నాన‌నీ, త‌ప్ప‌కుండా ఈ సినిమా పెద్ద విజ‌యం సాధిస్తుంద‌ని అనుకుంటున్నాన‌నీ ఆయ‌న అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో హీరో హీరోయిన్లు వైష్ణ‌వ్ తేజ్‌, కృతి శెట్టి, డైరెక్ట‌ర్ బుచ్చిబాబు, నిర్మాత‌ల్లో ఒక‌రైన వై. ర‌విశంక‌ర్ పాల్గొన్నారు.

డైరెక్ట‌ర్ బుచ్చిబాబు మాట్లాడుతూ, “నా ఫ‌స్ట్ ఫిల్మ్ ట్రైల‌ర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ‌వ‌డం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ క‌థ‌ను నేను మొద‌ట‌గా చెప్పింది ఆయ‌న‌కే. ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు మ‌ధ్య మ‌ధ్య‌లో కాల్ చేసి ఎలా వ‌స్తోంద‌ని అడిగేవారు. క‌థ విని ఆయ‌న ఇచ్చిన స‌పోర్ట్‌, ఎన‌ర్జీతోటే చిరంజీవి గారికీ, విజ‌య్ సేతుప‌తికీ, దేవి శ్రీ‌ప్ర‌సాద్‌కీ ఈ స్టోరీని నెరేట్ చేసుకుంటూ వ‌చ్చాను. ‘ఉప్పెన’ తీశాను” అన్నారు.

ఇక ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే, ఒక అంద‌మైన, అదే స‌మ‌యంలో ఉద్వేగ‌భ‌రిత‌మైన ప్రేమ‌క‌థ‌తో ఈ మూవీని డైరెక్ట‌ర్ బుచ్చిబాబు రూపొందించిన‌ట్లు అర్థ‌మ‌వుతుంది. హీరోయిన్‌ను చూసి, ఆమె అపురూప సౌంద‌ర్యానికి ప‌డిపోయిన హీరో త‌న ఫ్రెండ్‌తో, “అబ‌ద్ధాలాడితేనే ఆడ‌పిల్ల పుడ‌తారంటే, మ‌రీ ఇంత అంద‌గ‌త్తె పుట్టిందంటే మినిమ‌మ్ ఈళ్ల బాబు మ‌ర్డ‌రేమ‌న్నా చేసుంటాడేమిట్రా!” అని య‌థాలాపంగా అంటాడు. నిజానికి ఆమె తండ్రి అలాంటివాడేన‌ని ఆ త‌ర్వాత షాట్ల‌లో మ‌న‌కు క‌నిపిస్తుంది.

ఆ తండ్రిగా విజ‌య్ సేతుప‌తి న‌టించారు. ప‌రువు కోసం ఎంత‌టి క్రూర‌త్వానికైనా తెగ‌బ‌డే మ‌న‌స్త‌త్వం ఆయ‌న‌ద‌ని ట్రైల‌ర్ మ‌న‌కు చూపిస్తుంది. త‌న కూతుర్ని ఓ పేదింటి కుర్రాడు ప్రేమిస్తే ఆయ‌న చేతులు ముడుచుకొని కూర్చుంటాడా? త‌న కూతురు ఆ కుర్రాడితో క‌లిసి ఆనందంగా ఆడుతూపాడుతూ ఉండ‌టం క‌ళ్లారా చూసిన ఆయ‌న ఏం చేశాడు? వారి ప్రేమ‌ను తెంచేయ‌డానికి ఎంత‌టి ఘోరానికి పాల్ప‌డ్డాడు? త‌మ ప్రేమ‌ను ఆ యువ‌జంట కాపాడుకుందా? అనేది ఆస‌క్తికరం.

హీరోయిన్ త‌న తండ్రితో, “ప్రేమంటే ప‌ట్టుకోవ‌డం నాన్నా.. వ‌దిలెయ్య‌డం కాదు” అన‌డం చూస్తే, హీరోతో ప్రేమ‌ను వ‌దిలెయ్య‌మ‌ని ఆమెకి వార్నింగ్ ఇచ్చాడ‌నీ, అప్పుడామె ఆ మాట‌లు అన్న‌ద‌నీ అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల ప్రేమ స‌న్నివేశాల్ని ద‌ర్శ‌కుడు ఒక అంద‌మైన పెయింటింగ్ లాగా చిత్రీక‌రించార‌నేది స్ప‌ష్టం. మ‌ళ్లీ మ‌ళ్లీ వినాల‌నిపించే పాట‌లతో, థ్రిల్లింగ్ షాట్స్‌తో, అంతే ఉత్కంఠ‌భ‌రిత‌మైన‌ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో, సూప‌ర్బ్ అనిపించే విజువ‌ల్స్‌తో ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటోంది.

దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూర్చ‌గా ఇప్ప‌టికే విడుద‌లైన “నీ క‌న్ను నీలి స‌ముద్రం”, “ధ‌క్ ధ‌క్‌”, “రంగుల‌ద్దుకున్న”, “జ‌ల జ‌ల జ‌ల‌పాతం నువ్వు” పాట‌లు సంగీత ప్రియుల‌ను అమితంగా అల‌రిస్తున్నాయి.

తారాగ‌ణం:పంజా వైష్ణ‌వ్ తేజ్‌, విజ‌య్ సేతుప‌తి, కృతి శెట్టి, సాయిచంద్‌, బ్ర‌హ్మాజీ
సాంకేతిక బృందం:
క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: బుచ్చిబాబు సానా
నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, వై. ర‌విశంక‌ర్‌
బ్యాన‌ర్స్‌: మైత్రి మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌
సీఈవో: చెర్రీ
మ్యూజిక్‌: దేవి శ్రీ‌ప్ర‌సాద్‌
సినిమాటోగ్ర‌ఫీ: షామ్‌ద‌త్ సైనుద్దీన్‌
ఎడిటింగ్‌: న‌వీన్ నూలి
ఆర్ట్‌: మౌనిక రామ‌కృష్ణ‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌: అనిల్ వై, అశోక్ బి.
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌, మ‌ధు మ‌డూరి.

- Advertisement -