జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు కార్మిక సంఘాల మద్దతు..

129
b vinod
- Advertisement -

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగా నిర్వీర్యం చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. గురువారం బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ ఉద్యోగ, కార్మిక సంఘాల సమావేశాల్లో వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి మారుమూల, కొండల్లో, సముద్ర మార్గాల్లో సైతం బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ పనిచేస్తుందని, అలాంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు 5జీ సేవలు ఇవ్వని మోడీ ప్రభుత్వం, ప్రైవేటు మొబైల్ కంపనీలకు మాత్రం 5జీ సేవలు కల్పిస్తోందని ధ్వజమెత్తారు.

దాదాపు11 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్న బీఎస్ఎన్ఎల్ ను స్లో పాయిజన్ ఇచ్చి ఊపిరి తీస్తోందని ఆయన ఆరోపించారు. రిలయన్స్, జియో సంస్థల కోసం కేంద్ర ప్రభుత్వం బీ.ఎస్.ఎన్.ఎల్. సంస్థను ముంచుతోందని ఆయన అన్నారు. అలాగే దేశ ప్రజల అభిమానం పొందిన ఎల్.ఐ.సీ. ఉసురును కూడా మోడీ సర్కార్ తీసుకుంటోందని వినోద్‌ విమర్శించారు. దేశ సంపదను కొల్లగొట్టే వ్యక్తులు దేశ భక్తులు ఎలా అవుతారని వినోద్ కుమార్ ప్రశ్నించారు. దేశ సంపదను కాపాడాల్సిన బాధ్యత ప్రధాని మోడీపై ఉందని, కానీ అతని దేశ సంపదను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారని వినోద్ కుమార్ ఆరోపించారు.

చివరికి రైల్వేను కూడా ప్రైవేటుపరం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందని వినోద్ కుమార్ అన్నారు. ప్రజలను సెంటిమెంటుతో దెబ్బ తీస్తూ, సోషల్ మీడియా ద్వారా బీజేపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. శాంతి భద్రతల విషయంలో హైదరాబాద్ దేశంలోనే సురక్షిత నగరమని వినోద్ కుమార్ తెలిపారు. ఆరేళ్ల రాష్ట్ర పాలనలో ఒక్క ఫైరింగ్ లేదు, ఒక్క లాఠీచార్జీ లేదు.. ఒక్క రోజు కర్ఫ్యూ లేదు.. అని ఆయన పేర్కొన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల ప్రజలు సుఖ, సంతోషాలతో హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల మధ్య జీవిస్తున్నారని వినోద్ కుమార్ తెలిపారు.

26న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెకు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతును ఇస్తున్నట్లు వినోద్ కుమార్ ప్రకటించారు. ఈ సమావేశాల్లో బీ.ఎస్.ఎన్.ఎల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సంపత్ రావు, సాంబశివరావు, సుశీల్ కుమార్, చంద్రమౌళి, ఎల్.ఐ.సీ. ఉద్యోగుల సంఘం నాయకులు క్లైమేట్ దాస్, తిరుపతయ్య, ఆదీశ్ రెడ్డి, రాజేంద్ర బాబు, మహబూబ్, టీఆర్ఎస్ కార్మిక విభాగం ఇంచార్జీ రూప్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -