ఆర్టికల్ 370,ఆర్టికల్ 35 A అంటే ఏమిటి…?

703
article 35 A
- Advertisement -

జమ్మూ కశ్మీర్‌పై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్‌ను రెండుగా విభజిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. అంతేగాదు ఆర్టికల్ 35 A,ఆర్టికల్ 370ని రద్దు చేసింది. దీంతో ఈ రెండు ఆర్టికల్స్‌ గురించి తెలుసుకునే పనిలో పడ్డారు నెటిజన్లు.

1920లలో పంజాబ్ నుంచి కశ్మీర్‌కు ప్రజలు పెద్ద ఎత్తున వలస వచ్చారు. ఈ వలసలను నియంత్రించే క్రమంలో 1927లో నాటి జమ్ముకశ్మీర్ సంస్థానం మహారాజా హరిసింగ్ ఒక చట్టాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం కశ్మీర్ వాసులకు కొన్ని ప్రత్యేక హక్కులు కేటాయించారు.

1947లో జమ్ముకశ్మీర్ సంస్థానం భారత్‌లో విలీనం కాగా 1949లో జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రాజ్యాంగంలో చేర్చారు. ఆర్టికల్ 370 ప్రకారం జమ్ముకశ్మీర్‌లో కేవలం రక్షణ, విదేశీ వ్యవహారాలు, సమాచార ప్రసారాల వరకే కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి. ఇది ఆ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం, జెండా కలిగి ఉండే వీలును కల్పించింది.

1952లో నాటి భారత ప్రధాని నెహ్రూ, షేక్ అబ్దుల్లా మధ్య  ఢిల్లీ ఒడంబడిక జరిగింది. దీని ప్రకారం కశ్మీర్‌ ప్రజలకు కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించాలని నిర్ణయించారు. 1954లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఆర్టికల్ 35ఎను రాజ్యాంగంలో చేర్చారు.

కశ్మీర్‌లో శాశ్వత నివాసులు ఎవరో నిర్ణయించే అధికారాన్ని ఆ ఆర్టికల్ ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఇచ్చింది. దీని ప్రకారం శాశ్వత నివాసులకు కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించారు. జమ్ము కశ్మీర్‌లో ఎవరు స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు, ఏయే సందర్భాల్లో ఎలాంటి వారికి ఏయే హక్కులు లభిస్తాయి అనే అంశాలను ఈ ఆర్టికల్ నిర్వచిస్తోంది.

()రాష్ట్ర ప్రభుత్వం కల్పించే ఉపకార వేతనాలు, ఇతర ప్రయోజనాలు శాశ్వత నివాసులకే అందుతాయి.

()రాష్ట్ర సర్వీసుల్లో నియామకాలకు అక్కడి శాశ్వత నివాసులు మాత్రమే అర్హులు.

()శాశ్వత నివాసులు మాత్రమే రాష్ట్రంలో స్థిరాస్తులు కొనుగోలు చేయాలి. ఇతరులు కొనుగోలు చేయరాదు.

ఆర్టికల్ 35A నిబంధనల ప్రకారం.. జమ్ము కశ్మీర్‌లో శాశ్వత నివాసిగా గుర్తింపు పొందిన వ్యక్తి కుమార్తె శాశ్వత నివాసి కాని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆమె కూడా తన శాశ్వత నివాస హోదాను కోల్పోతుంది. ఆమె సంతానానికి కూడా శాశ్వత నివాస హోదా రాదు. ఇలాంటి సందర్భాల్లో వారు వారసత్వంగా తమకు ఏమైనా స్థిరాస్తులు వచ్చినా దాన్ని చట్టబద్ధంగా పొందలేరు. రాష్ట్రంలో విద్యా, ఉద్యోగ అవకాశాలను కూడా పొందలేరు.

()ఆర్టికల్ 370

జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ నాటి భారత ప్రభుత్వం చేసిన ఏర్పాటే ఆర్టికల్ 370. ఈ ఆర్టికల్ వల్ల రాజ్యాంగం ప్రకారం ఇతర రాష్ట్రాలకు వర్తించిన నిబంధనలేవీ జమ్మూ కశ్మీర్‌కు వర్తించవు. దీని ప్రకారమే 1965 వరకూ ఆ రాష్ట్రానికి సీఎం బదులు ప్రధాని, గవర్నర్ స్థానంలో ప్రెసిడెంట్ ఉండేవారు.

()రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సమాచార శాఖల వ్యవహారాలు మినహా మిగతా చట్టాల అమలుకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి.

() ఆర్టికల్ 370 ప్రకారం బయటి వ్యక్తులు జమ్మూ కశ్మీర్లో భూమి లేదా ఆస్తులు కొనుగోలు చేయడం కుదరదు.
() జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక పీనల్ కోడ్ ఉన్నాయి.

() జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ కాలపరిమితి ఆరేళ్లు.

() రాష్ట ప్రజలకు ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది.

()యుద్ధం, విదేశీ దురాక్రమణ సమయంలోనే కేంద్రం ఆ రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించగలదు. అంతర్గత ఘర్షణలు తలెత్తినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి లేనిదే ఎమర్జెన్సీ విధించలేం.

- Advertisement -