టీమిండియా ఓటమిపై స్పందించిన కోహ్లీ..

387
Virat Kohli
- Advertisement -

మాంచెస్టర్‌: వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా కథ ముగిసింది. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో భారత్‌ 18 పరుగుల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమిపై టీమిండియా సారథి విరాట్ కోహ్లీ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.

మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. లక్ష్యఛేదన ఆరంభంలో తాము ఓ 45 నిమిషాల పాటు చెత్తగా ఆడామని, అదే తమ కొంప ముంచిందని కోహ్లీ ఆవేదన వ్యక్తం చేశాడు. ఓటమి బాధను భరించలేకపోతున్నామని, కానీ ఈ విజయానికి న్యూజిలాండ్ అన్ని విధాలుగా అర్హురాలని అభిప్రాయపడ్డాడు.

dhoni

కొన్ని కీలక సమయాల్లో న్యూజిలాండ్ చూపించిన తెగువ వారిని గెలుపు తీరాలకు చేర్చిందని కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఈ పోరులో తమ షాట్ సెలక్షన్ చాలా పేలవంగా ఉందని, పిచ్‌ను బాగా ఉపయోగించుకున్న కివీస్ బౌలర్లు స్వింగ్‌తో తమను దెబ్బకొట్టారని అంగీకరించాడు.

గత రెండు మ్యాచ్‌ల్లో రవీంద్ర జడేజా అద్భుతంగా రాణించాడని, ధోనీ అతడితో మంచి భాగస్వామ్యం నెలకొల్పినా, చివర్లో ధోనీ రనౌట్‌తో పరిస్థితి మారిపోయిందని కోహ్లీ వివరించాడు. జడేజా దూకుడుతో తన ఉద్దేశాన్ని స్పష్టంగా చాటాడని, కానీ, న్యూజిలాండ్ బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబర్చారని కోహ్లీ పేర్కొన్నాడు. ఇక న్యూజిలాండ్‌ వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరింది.

- Advertisement -