ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు కొనసాగుతునే ఉన్నాయి. రాజకీయాలకు అతీతంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలుపుతున్నారు. ఇక ప్రధానపార్టీలైన టీడీపీ,వైసీపీలు ప్రత్యేక హోదాపై ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటుండటంతో పొలిటికల్ హిట్ రాజేసింది.
ఇక ప్రత్యేక హోదా సాధన కోసం కమెడియన్ వేణుమాధవ్ కదిలారు. అనంతపురం జిల్లా హిందూపురంలో సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. కిరికెర నుంచి సైకిల్‌యాత్ర ప్రారంభం సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన వేణు…సైకిల్ తొక్కారు. ఈ సందర్భంగా మాట్లాడిన వేణుమాధవ్ … ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు స్ఫూర్తితో సైకిల్ యాత్రలో పాల్గొన్నట్టు వేణుమాధవ్ తెలిపారు. హోదా సాధించే వరకూ ఉద్యమం కొనసాగుతుందని… ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మొండిచేయి చూపిందని విమర్శించారు.
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై పార్లమెంటులో కేంద్రం వ్యవహరించిన తీరుకు నిరసనగా టీడీపీ,వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌ను స్తంభించిన సంగతి తెలిసిందే. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు వైసీపీ ఎంపీలు రాజీనామా అస్త్రాలను సంధించగా టీడీపీ ఏకంగా ఎన్డీయే నుంచి వైదొలిగింది. టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు కేంద్రమంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు.