తెలంగాణ దేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తుంది..

231
- Advertisement -

తాగునీటి కోసం తెలంగాణ ఎన్నటికీ తన్లాడొద్దన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం అన్నారు మిషన్ భగీరథ వైస్ చైర్మెన్ వేముల ప్రశాంత్ రెడ్డి. మిషన్ భగీరథతో తాగునీటి సరాఫరాలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా మారుతుందన్నారు. మిషన్ భగీరథ పనుల పురోగతిపై ఈ రోజు సచివాలయంలోని తన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రశాంత్ రెడ్డి, త్వరగా పనులు పూర్తి చేసి ఇంటింటికి నల్లాతో నీటిని సరాఫరా చేయాలన్నారు.

Vemula Prashanth Reddy

గత నెల 30 తారీఖు నాడు భగీరథ పనుల పురోగతిపై వర్క్ ఏజెన్సీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో చర్చించిన అంశాల పురోగతి ఎంతవరకు వచ్చిందో ప్రశాంత్ రెడ్డి తెలుసుకున్నారు. ముఖ్యంగా లేబర్ ను రెట్టింపు చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలను వర్క్ ఏజెన్సీలు అమలు చేస్తున్నాయో లేదో అధికారులను అడిగారు.

ముఖ్యమంత్రి కి ఇచ్చిన మాట ప్రకారం ఏజెన్సీలు లేబర్‌ను పెంచాయని, అయితే ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని చీఫ్ ఇంజనీర్లు చెప్పారు. దీనిపై స్పందించిన ప్రశాంత్ రెడ్డి, లేబర్ బ్యాచ్ లను వందకు వందశాతం పెంచేలా ఏజెన్సీలపై ఒత్తిడి తీసుకురావాలని చీఫ్ ఇంజనీర్లను ఆదేశించారు. ఇక ఇంట్రా పనుల కోసం తీసుకొస్తున్న మెటీరియల్ ను జాగ్రత్తగా నిల్వ చేయాలని సూచించారు. ప్రభుత్వ గిడ్డంగులు, పోలీస్ స్టేషన్ల పరిసరాల్లో ఉంచాలన్నారు. ఇంట్రా పనులకు అవసరమైన పైపులు, ఇతర సామాగ్రిని త్వరగా అందించేలా తయారీదారులతో మాట్లాడాలన్నారు.

Vemula Prashanth Reddy

OHSR నిర్మాణ పనులకు సమాంతరంగా గ్రామాల్లో అంతర్గత పైప్ లైన్ పనులు చేయాలన్నారు ప్రశాంత్ రెడ్డి. OHSR నిర్మాణం పూర్తయ్యే లోపు గ్రామంలోని ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్ ఇవ్వడం పూర్తి కావాలన్నారు. ఏజెన్సీలతో సమన్వయపరుచుకంటూ పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో RWS&S ఈ.ఎన్.సి సురేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు జ్ఞానేశ్వర్, చీఫ్ ఇంజనీర్లు కృపాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, విజయపాల్ రెడ్డి, విజయప్రకాశ్, OSD సత్యపాల్ రెడ్డితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -