మొక్కలను రక్షించేందుకు చిన్నారుల వినూత్న ప్రయత్నం..

85

పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు అనే నానుడిని నిజం చేస్తున్నారు ఈ బాలలు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కోటా కింద బస్తీలో ఈ పిల్లలు చేసిన ప్రయత్నం అబ్బుర పరుస్తోంది. తెలంగాణకు హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఎండిపోకుండా తమ వంతుగా వినూత్న ప్రయత్నం చేశారు. గత వారం రోజుల నుండి వర్షాలు పడక పోవడంతో తెలంగాణకు హరితహారం,పల్లె ప్రగతిలో భాగంగా వెల్దుర్తి మండల కేంద్రంలో నాటిన మొక్కలను రక్షించేందుకు చిన్న పిల్లలు ముందుకు వచ్చారు. తమ సైకిల్‌కు డబ్బా కట్టి అందులో నీళ్లు నింపి ప్రతి మొక్కకు నీళ్లు పోస్తున్న దృశ్యాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి.

మొక్కలకు నీళ్లు పోసేందుకు ఓ డబ్బాను తయారుచేసి, దానికి పైపును బిగించి తమ సైకిల్ కు కట్టారు. సమీపంలో ఉన్న కాలువ నుంచి నీటిని డబ్బాలో తోడి, సైకిల్ ద్వారా తరలించి మొక్కలకు పైప్ ద్వారా నీరందింస్తున్నారు. తమ కాలనీలో నాటిన మొక్కలు ఎండిపోవద్దనే ఈ ప్రయత్నం చేస్తున్నామని, ఈ మొక్కలు పెరిగి చెట్లయితే తమకు ఆక్సీజన్‌తో పాటు నీడనూ ఇస్తాయని చెబుతున్నారు. వెల్దుర్తికి చెందిన తాటి సాత్విక్, సుశాంత్, శ్రీకాంత్ తమ స్నేహితులతో కలిసి చేస్తున్న ఈ ప్రయత్నం అందరికీ ఆదర్శంగా నిలిచింది. స్థానిక పెద్దలు కూడా ఈ పిల్లలను అభినందించారు.