విచారణకు రాలేము- టీవీ9 రవి ప్రకాశ్‌.. నటుడు శివాజీ

184

సంతకం ఫోర్జరీతో పాటు డేటా చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు టీవీ చానెల్ టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాశ్‌కు పోలీసులు సీఆర్‌పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఆయన దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు. పోలీసులు పెట్టిన గడువు కూడా ముగియడంతో రవి ప్రకాశ్‌ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇటీవల ఆయన హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ హైకోర్టు షాకిచ్చింది. రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.

ఇక రవిప్రకాశ్ ఎక్కడున్నారనే విషయంపై ఇప్పటికీ స్పష్టతలేదు. ఆయన ఏపీలో ఉన్నారని కొందరు.. ముంబైలో వెళ్లిపోయారని మరికొందరు చెబుతున్నారు. ఆయన తన సెల్‌ఫోన్‌ను కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. రవిప్రకాశ్ కుటుంబ సభ్యులు, స్నేహితులు తమకేమీ తెలియదని పోలీసులతో చెబుతున్నారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న సినీనటుడు శివాజీ కూడా పరారీలో ఉన్న విషయం తెలిసిందే.

TV9 Ravi Prakash

అయితే వీరిద్దరూ తాజాగా ఈ విషయంపై స్పందించారు. తాను ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉన్నానని, వ్యక్తిగత కారణాల వల్ల ప్రస్తుతం విచారణకు హాజరు కాలేనని రవిప్రకాశ్, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం పంపారు. విచారణకు హాజరయ్యేందుకు తనకు మరో 10 రోజుల గడువు కావాలని ఆయన కోరారు. పోలీసులకు ఈ సమాచారం మెయిల్ ద్వారా అందింది.

ఇక రవిప్రకాశ్ తీరుగానే నటుడు శివాజీ కూడా స్పందించాడు, తనకు ఆరోగ్యం బాగాలేదని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని, తనకు కూడా 10 రోజుల గడువు కావాలని పోలీసులను కోరారు. ఈ మేరకు ఆయన ఓ మెయిల్ ను పంపారు. రవిప్రకాశ్, శివాజీలు పంపిన ఈ-మెయిల్స్ పై సంతృప్తి చెందని పోలీసులు, ఐపీ అడ్రస్ ల ఆధారంగా వీరిద్దరూ విజయవాడలో ఉంటున్నట్టు గుర్తించారని తెలుస్తోంది. కాగా వీరిద్దరి అరెస్టు కోసం అవసరమైన ఆధారాల్ని పోలీసులు సేకరించి ఉంటారని సమాచారం.