చివరి కోరిక తీరకుండానే!

98
raju
- Advertisement -

సీనియర్ నటుడు ఉప్పలపాటి కృష్ణంరాజు ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. పోస్టు కోవిడ్ సమస్యలు రావడంతో ఇటీవల హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో ఆయన చేరారు. ఇప్పటికే రెండు సార్లు పోస్ట్ కోవిడ్ సమస్యలతో ఆయన చాలా బాధపడ్డారు. దాంతో పరిస్థితి అత్యంత విషమంగా మారిన ఆయన.. ఇవాళ తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు.

కృష్ణంరాజు మృతితో తెలుగు సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. కృష్ణంరాజుకు భార్య శ్యామలా దేవి, ప్రసీద, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
కృష్ణంరాజు తమ్ముడు సూర్యనారాయణ రాజు కుమారుడు ప్రభాస్. ఇక ప్రభాస్ పెళ్లి చూడాలని ఉందని పలుమార్లు తెలిపిన కృష్ణంరాజు ఆ కోరిక తీరకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయారు.

1966 లో వచ్చిన చిలుక గోరింక సినిమా తో హీరో గా సినీరంగ ప్రవేశం చేశారు. చివరి సారిగా రాధే శ్యామ్ సినిమాలో నటించారు.తన కెరీర్‌లో దాదాపు 187 చిత్రాల్లో నటించిన కృష్ణంరాజు…జీవన తరంగాలు, కృష్ణవేణి, భక్త కన్నప్ప, అమర దీపం, కటకటాల రుద్రయ్య, మనవూరి పాండవులు, రంగూన్ రౌడీ, త్రిశూలం, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు, బావ బావమరిది, పల్నాటి పౌరుషం రుద్రమదేవి వంటి ప్రజాదరణ పొందిన చిత్రాల్లో నటించారు.
ఎన్టీఆర్ తో కలసి 7 సినిమాలు, ఏన్నార్ తో 6, కృష్ణ తొ 21 సినిమాలు,శోభన్ బాబు 8 సినిమాల్లో కలసి నటించారు. హిట్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకుంది కృష్ణంరాజు కృష్ణ కాంబినేషన్.

కృష్ణంరాజు సొంత నిర్మాణ సంస్థ గోపీకృష్ణ మూవీస్ బ్యానర్, ఈ బ్యానర్‌పై 11 సినిమాలు నిర్మించారు. 1991లో కాంగ్రెస్ పార్టీలో చేరిన కృష్ణంరాజు… 1998 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరి కాకినాడ నుండి గెలుపొందారు. 1999 మధ్యంతర ఎన్నికలలో నర్సాపురం లోక్‌సభ నుండి గెలుపొంది కేంద్రంలో వాజపేయి నేతృత్వంలో మంత్రిపదవిని నిర్వహించారు. 2009లో బీజేపీని వీడి ప్రజారాజ్యంలో చేరారు.

- Advertisement -