ప్రాణభయంతో..కొబ్బరి చెట్టుపైనే మూడేళ్లు

304
This man has been living on a coconut tree for nearly 3 years
- Advertisement -

ఏదైనా అనుకోని సంఘటన లేదా ప్రమాదాల కారణంగా మతిస్థిమితం కోల్పోయే పరిస్థితి వస్తే.. ఆ వ్యక్తి మళ్లీ యథాస్థితికి రావడం దాదాపు కష్టమే. ఒకవేళ వచ్చినా దానికి చాలా సమయం పడుతుంది. అందుకే ఏ వ్యక్తి జీవితంలోనైనా మానసిక స్థితి చాలా కీలకమైనది. అయితే లేనిపోని అనుమానాలతో భయాంతో మానసిక ఒత్తిడికి గురై మతిస్థిమితం కోల్పోయిన వారూ ఉంటారు. ఆ సమయంలో వారు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు.

తాజాగా ఫిలిప్పీన్స్‌లో ఓ వ్యక్తి ఆ విధంగానే అనవసర భయాందోళనకు గురయ్యాడు. తనను ఎవరో చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తన ఇంటికి సమీపంలోని కొబ్బరిచెట్టు ఎక్కేశాడు. అలా కొబ్బరిచెట్టు ఎక్కిన ఆ వ్యక్తి.. ఏకంగా మూడేళ్ల పాటు చెట్టుపైనే గడిపాడు. ఫిలిప్పీన్స్‌లోని అగుసాన్‌ డెల్‌ ప్రావిన్స్‌ లా పేజ్‌కు చెందిన గిల్బెర్ట్‌ సాంచెజ్‌ అనే 47 ఏడేళ్ల వ్యక్తి మూడేళ్ల క్రితం తన ఇంటికి సమీపంలో ఉన్న 60 అడుగుల కొబ్బరిచెట్టు ఎక్కాడు. 2014లో చెట్టుపైకి ఎక్కిన ఆయన.. కొద్దిరోజుల క్రితం వరకు కిందికి దిగలేదు. మూడేళ్లకు పైగా అదే చెట్టుపై గడిపాడు.

This man has been living on a coconut tree for nearly 3 years

కిందికి వస్తే తనను ఎవరైనా చంపేస్తారంటూ విచిత్రంగా వాదించడం మొదలెట్టాడు. అందుకే చెట్టుపైనే ఉంటానని భీష్మించుకున్నాడు. ఆ ప్రాంతంలో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి గిల్బెర్ట్‌ తలపై తుపాకీతో కొట్టారని.. అప్పటి నుంచి ఆయన ఈ విధంగా భయాందోళన చెందుతూ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని అతని తల్లి వినిఫ్రెడా తెలిపారు. ఎన్నిసార్లు ప్రాధేయపడినా గిల్బెర్ట్‌ కిందికి రాకపోవడంతో చేసేదేమీలేక కుటుంబసభ్యులే రోజూ అతనికి ఆహారం అందించేవారు. ఓ తాడు సాయంతో ఆహారం, నీరు, సిగరెట్లు, దుస్తులను చెట్టుపైకి చేర్చేవారు. దాన్ని గిల్బెర్ట్‌ అందుకునేవాడు. ఈ విధంగా మూడేళ్లు గడిచిపోయాయి.

ఏళ్ల తరబడి చెట్టుపైనే ఉండిపోవడంతో అతనికి పలు రకాలు చర్మ వ్యాధులు సోకాయి. శరీరం నుంచి దుర్వాసన కూడా వచ్చేది. ఎన్ని ప్రయత్నాలు చేసినా గిల్బెర్ట్‌ కిందికి దిగలేదు. అతని కుమార్తెలు సైతం ప్రాధేయపడినా పరిస్థితిలో మార్పు రాలేదు. కిందికి దిగితే తనను ఎవరైనా చంపేస్తారని.. ఎట్టిపరిస్థితుల్లోనూ దిగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేవాడు. కనీసం స్నానం చేసేందుకైనా కిందికి రావాలని చెప్పినా వినిపించుకోలేదని అతని తల్లి వినిఫ్రెడా కన్నీటి పర్యంతమవుతూ చెప్పింది.

చివరికి సోషల్‌మీడియాలో ఈ విషయం వైరల్‌గా మారడంతో ఫిలిప్పీన్స్‌లోని మీడియా సంస్థలు దృష్టి సారించి కథనాలు ప్రసారం చేశాయి. దీనికి స్పందించిన ప్రభుత్వం గిల్బెర్ట్‌ను చెట్టు నుంచి కిందికి దించే చర్యలను ప్రారంభించింది. అక్టోబర్‌ 11న 50 మందితో కూడిన రెస్క్యూ టీం అతన్ని సురక్షితంగా కిందికి దించింది. అనంతరం అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు.

- Advertisement -