మణిపూర్‌లో ఉగ్ర దాడి..

110
- Advertisement -

మణిపూర్‌లో ఉగ్రవాదులు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన భారత్‌- మయన్మార్‌కు సరిహద్దు, చురాచంద్‌పూర్ జిల్లాలోని సింఘత్ సబ్ డివిజన్‌లో చోటు చేసుకున్నది. ఈ ఘటనలో భారత ఆర్మీ కల్నల్, ఆయన భార్య, కుమారుడుతోపాటు మరో నలుగురు జవాన్లు అమరులయ్యారు. ఇటీవలి కాలంలో జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని అధికారులు చెబుతున్నారు.

అస్సాం రైఫిల్స్ కాన్వాయ్‌పై గుర్తుతెలియని ఉగ్రవాద సంస్థ దాడికి పాల్పడింది. ఉగ్రదాడిలో ఆర్మీ కల్నల్, ఆయన భార్య, కుమారుడు మృతి చెందిన విషయాన్ని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ నిర్ధారించారు. ఉగ్రఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల కోసం రాష్ట్ర, పారామిలటరీ బలగాలు గాలిస్తున్నాయని చెప్పారు.

మణిపూర్‌కు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడికి పాల్పడినట్లు ఆర్మీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఉగ్రవాద దాడిని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఖండించారు. దాడిని పిరికిపందల చర్యగా పేర్కొన్నారు. సైనికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్న ఆయన.. అమరులైన వారికి నివాళులర్పించారు. ఘటనకు బాధ్యులైన వారిని వదిలేది లేదని హెచ్చరించారు.

- Advertisement -