క్రీడా దిగ్గజాలు, సినీ ప్రముఖుల నడుమ పీకేఎల్ ఐదో సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. సచిన్ తెందుల్కర్, పి.వి.సింధు, పుల్లెల గోపీచంద్, చిరంజీవి, రాణా దగ్గుబాటి, అల్లు అర్జున్, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్, చాముండేశ్వరినాథ్‌తో సహా సెలెబ్రిటీలు గచ్చిబౌలీ స్టేడియానికి తరలివచ్చారు. మ్యాచ్‌కు ముందు బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ జాతీయ గీతాన్ని ఆలపించాడు.
కూతలో జోరు తగ్గలేదు. పట్టులో పదును తగ్గలేదు. అభిమానుల్లో హుషారు తగ్గలేదు. మొత్తంగా ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో వాడి తగ్గలేదు. ఆటగాళ్ళ కసి.. అభిమానుల ఉత్సాహం నడుమ శుక్రవారం హైదరాబాద్‌లో పీకేఎల్ ఐదో సీజన్ అట్టహాసంగా ఆరంభమైంది. తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య తెలుగు టైటాన్స్ బోణీకొట్టి అభిమానుల్లో జోష్ నింపింది. తెలుగు టైటాన్స్ 32-27తో తమిళ్ తలైవాస్‌ను చిత్తుచేసింది. తమిళ్ జట్టు యజమానిగా పీకేఎల్‌లో అడుగుపెట్టిన క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్‌కు తొలి మ్యాచ్‌లోనే చేదు అనుభవం తప్పలేదు.
లీగ్‌లో తొలిసారిగా అడుగుపెట్టిన తలైవాస్ అనుభవలేమి మొదటి మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది. ఆటగాళ్ళలో సమన్వయలోపం.. వ్యూహాల్లో వైఫల్యం.. డిఫెన్స్‌లో లోపాలతో ఆ జట్టు మూల్యం చెల్లించుకుంది. మరోవైపు తెలుగు టైటాన్స్ పూర్తి సాధికారిత.. పరిణతితో ఆడింది. కెప్టెన్ రాహుల్ చౌదరి జట్టును ముందుండి నడిపించాడు. 10 రైడ్ పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మూడు సార్లు డూ ఆర్ డై రైడింగ్‌లలో పాయింట్లు రాబట్టిన నీలేశ్ సాలుంకే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
మరో మ్యాచ్‌లో పుణెరి పల్టాన్ 33-21తో యు ముంబాపై విజయం సాధించింది. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన యు ముంబాకు పుణెరి పల్టాన్ ఝలక్ ఇచ్చింది. పుణెరి 33-21 తేడాతో ముంబాపై ఘనవిజయం సాధించింది. కెప్టెన్ దీపక్ హుడా ఐదు పాయింట్లతో పుణెరి విజయంలో కీలక పాత్ర పోషించాడు. సందీప్ నర్వాల్ 4 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు.