తెలంగాణ ప్రజలకు ఉద్యమాలు చేయటం కొత్తేమీ కాదు.. ఉగాది తరువాత ఉగ్ర తెలంగాణను కేంద్ర ప్రభుత్వం చూడబోతున్నదని మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఆహార శాఖ మంత్రా? లేక ఆహారపు అలవాట్లు మార్చే మంత్రిత్వ శాఖనా? అని మంత్రి ఎద్దేవా చేశారు. సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు సంబంధించి భవిషత్తు కార్యాచరణపై శనివారం తెలంగాణ భవన్‌లో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, ప్రశాంత్‌రెడ్డిలు మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
నూకలు తినాలని కేంద్రమంత్రి అనటాన్ని మంత్రి అజయ్ తీవ్రంగా ఖండిస్తూ.. ఉగాది పండుగ తరువాత నూకలు ఎవరైతరో, పొట్టు ఎవరైతరో పోరుబాట ద్వారా కేంద్రానికి చూపిస్తామని సవాల్ చేశారు. ఉద్యమం అనంతరం తెలంగాణలో బీజేపీ పార్టీ పొట్టు అవుతుందని చెప్పారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అర్ధంలేని మాటలు మాట్లాడుతున్నారని, తన సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రజల ఆహారపు అలవాట్లు మార్చే ప్రయత్నం చేయాలని లేదా పీయూష్ గోయల్ వ్యాఖ్యలను ఖండించాలని డిమాండ్ చేశారు.
దశాబ్దాల అరిగోస తర్వాత ఇప్పుడిప్పుడే సన్నబువ్వ తింటున్న తెలంగాణ ప్రజల మనోభావాలను కేంద్ర ప్రభుత్వం అవమానించిందన్నారు. హరితవిప్లవం వల్ల పంజాబ్‌లో వరి ఉత్పత్తి పెరిగింది అలాంటి కేంద్ర ప్రోత్సాహం లేకుండానే వరిలో అగ్రస్థానానికి తెలంగాణ ఎదిగిందని స్పష్టం చేశారు. పంజాబ్‌లో కొన్నట్లే తెలంగాణలోనూ మొత్తం ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు. కేంద్రం తనకు నచ్చని రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతుందని రైతులకు మెడమీద కత్తి పెట్టింది కేంద్ర ప్రభుత్వమేనని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు.
ధాన్యం సేకరణలో కేంద్రానిది ముమ్మాటికీ వైఫల్యమేనని కేంద్ర ప్రభుత్వం తన అసమర్థతను ఒప్పుకోవాలన్నారు. ధాన్యం కొనలేమంటున్న కేంద్రం ఎందుకు కొనరో నేరుగా, వివరంగా ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ధాన్యం సమస్యకు పరిష్కారం చూపమంటే ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. బాయిల్డ్ రైసు విధానాన్ని కేంద్ర ప్రభత్వమే ప్రవేశపెట్టిందని రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని త్వరగా తీసుకెళ్లాల్సిన బాధ్యత కేంద్రానిదేనని తెలిపారు. రైతుల విషయంలో కేంద్రానిది అవకాశవాద ధోరణిలా కనిపిస్తోందని ఒక్కో ప్రభుత్వ సంస్థను కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తోందని ఆరోపించారు.
ధాన్యం విషయంలో పీయూష్ గోయల్ పచ్చి అబద్దాలు మాట్లాడారని కేంద్రంలోనిది వ్యాపారాత్మక ప్రభుత్వమని వ్యవసాయాధారిత దేశాన్ని పాలించే ప్రభుత్వానికి ఉండాల్సిన లక్షణాలు దానికి లేకపోవడం దౌర్భాగ్యమని నిప్పులు చెరిగారు. ఇప్పుడు కేంద్రం బాయిల్డ్ రైస్ తీసుకోమంటే రాష్ట్రంలో పండించే మొత్తం రైస్ తీసుకోమని చెప్పినట్లేనని విమర్శించారు. రాజకీయాల కోసం రైతులను, ప్రజలను భాజపా మోసం చేస్తోందని ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌కు రైతుల పక్షాన పోరాడే సత్తా లేదని దుయ్యబట్టారు. రైతుల కోసం పార్లమెంట్‌లో పోరాటం చేసేది తెరాస మాత్రమేనని మంత్రి అజయ్ కుమార్ తెలిపారు.