మేడ్చల్ మల్కాజ్‌గిరిలో నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్. దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాలకూ 24 గంటలూ కరెంట్ అందిస్తున్నాం. హైదరాబాద్‌లో కరెంట్ పోదు కానీ.. ఢిల్లీలో 24 గంటలు కరెంట్ ఉండదు. దేశంలో 8 ఏళ్ల నుంచి జరుగుతున్న అసమర్థ పరిపాలన, చేతకాని, తెలివి తక్కువతనం పరిపాలన వల్లే ఈ ఇబ్బందులు. దేశంలో నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణనే. అంకిత భావం ఉంటే ఏదైనా సాధ్యమవుతుందన్నారు.
తెలంగాణలో చాలా నిధులు ఉన్నాయని… మన రాష్ట్రం ముమ్మాటికీ ధనిక రాష్ట్రమన్నారు. గతంలో తెలంగాణలో తలసరి ఆదాయం రూ.లక్ష మాత్రమే ఉంది కానీ ప్రస్తుతం తెలంగాణలో తలసరి ఆదాయం రూ.2,78,500 పెరిగిందన్నారు. దేశంలోనే తెలంగాణ ఉద్యోగులకు అత్యధిక వేతనాలు అందుతున్నాయన్నారు. ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నాం. చేనేత కార్మికులకు కూడా పింఛన్లు అందిస్తున్నాం. రాష్ట్రంలో అవినీతి రహిత పాలనను అందిస్తున్నమన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. దేశంలోనే అత్యధిక గురుకుల పాఠశాలలు ఉన్న ఏకైక రాష్ట్రం…. గురుకుల విద్యార్థులు నుంచి మంచి ఫలితాలు సాధిస్తున్నామన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లల ద్వారా నీళ్లు ఇచ్చి, కొరత తీర్చమన్నారు.
భవనం కట్టాలంటే చాలా కష్టం కానీ కూలగొట్టాలంటే చాలా ఈజీ. మతం, కులం పేరిట దేశాన్ని విడదీసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఇది ఏ రకంగానూ మంచిది కాదు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాలి. ఒకసారి దెబ్బతిన్నామంటే మళ్లీ ఏకం కావడం అంత ఈజీ కాదన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు దేశ పరిస్థితులపై అవగాహన తెచ్చుకొవాలని పిలుపునిచ్చారు.