తెలంగాణ కోసం పుస్తకాలు రావాలి :సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

63
- Advertisement -

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఆర్థిక, సామాజిక, అభివృద్ధి రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అన్నారు. ప్రస్తుత తెలంగాణాను పోల్చుతూ మరింత పరిశోధనాత్మక రచనలు వెలువడాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్‌కే భవన్‌లోని తన కార్యాలయంలో అడపా సత్యనారాయణ, డాక్టర్‌ ద్యావనవెళ్లి సత్యనారాయణ రాసిన తెలంగాణ హిస్టరీ, కల్చర్, మూవ్‌మెంట్స్‌ అనే పుస్తకాన్ని సీఎస్‌ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి మూలకు చరిత్ర ఉంటుందని సీఎం కేసీఆర్‌ అంటుంటారని, ఈ గ్రంథంలోని చారిత్రక అంశాలను చూస్తే మరోసారి నిరూపిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాల చరిత్రను సమగ్రంగా విశ్లేషిస్తూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాలను ప్రత్యేకంగా వివరిస్తూ విషయ నిపుణులు ఆంగ్లంలో తెలంగాణ హిస్టరీ, కల్చర్ అండ్ మూవ్‌మెంట్స్‌ను సాధికారికంగా రాయడం అభినందనీయమని సీఎస్‌ అన్నారు. రాష్ట్రంలో దాదాపు 90వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఈ కాంపిటీటివ్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఈ గ్రంధం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

తెలంగాణ చరిత్రను వక్రీకరించేవిధంగా పలు సినిమాలు వస్తున్నాయని, ఇదే కోవలో మరికొన్ని సినిమాలు వచ్చే అవకాశమున్నందున తెలంగాణ చారిత్రిక, సాంస్కృతిక, సామాజిక అంశాలపై ఇలాంటి సాధికారిక గ్రంధాలు రావాల్సిన అవసరముందని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు.

సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ మాట్లాడుతూ, వివిధ రాష్ట్రాల చరిత్ర కారులకు తమ రాష్ట్ర చరిత్ర రచనకు ఈ గ్రంధం ప్రామాణికంగా ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, ప్రొఫెసర్ కిశోర్, తెలంగాణ పబ్లికేషన్స్ కార్యదర్శి చంద్ర మోహన్ పాల్గొన్నారు.

- Advertisement -