అంతర్గత పోరు..రేవంత్‌కు తలనొప్పి!

75
revanth
- Advertisement -

టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి ఓ పక్క సీనియర్ల విబేధాలు..మరోపక్క జిల్లాలలో కాంగ్రెస్ నాయకుల మధ్య అంతర్గత పోరు తలనొప్పిగా మారింది. హుజురాబాద్ ఉప ఎన్నికల తర్వాత పతనమైన కాంగ్రెస్ పార్టీని మళ్లీ పైకి లేపి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకువచ్చేందుకు నానా తంటాలు పడుతున్న రేవంత్ రెడ్డికి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు మరింత టెన్షన్ పెట్టిస్తున్నాయి. దాదాపుగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులు రెండు నుంచి మూడు వర్గాలుగా చీలిపోయి ఆధిపత్య పోరు కోసం కొట్టుమిట్టాడుతున్నారు. రేవంత్ సొంత జిల్లా ఉమ్మడి పాలమూరులో కూడా ఇదే పరిస్థితి. టీడీపీకి కంచుకోట అయిన దేవరకద్ర ఇప్పుడు టీఆర్ఎస్‌ అడ్డాగా మారిపోయింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆలె వెంకటేశ్వర రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. సౌమ్యుడు, వివాదరహితుడు, నిత్యం ప్రజల్లోకి అందుబాటులో ఉండే ఆలె వెంకటేశ్వర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలవడం ఖాయమని దేవరకద్రలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు దేవరకద్ర కాంగ్రెస్‌ నాయకులు వర్గ విబేధాలతో తమలో తాము కొట్టుకుంటూ పార్టీ పరువు తీస్తున్నారు.

దేవరకద్ర ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే పెద్ద నియోజకవర్గం. ఏడు మండలాలు ఉన్నాయి. 2009లో దేవరకద్ర నియోజకవర్గం ఏర్పడినప్పుడు తొలుత టీడీపీ పాగా వేసింది. 2014, 2018లో టీఆర్ఎస్‌ పట్టు బిగించింది. కాంగ్రెస్‌కు క్షేత్రస్థాయిలో పట్టున్నా.. ఎన్నికల నాటికి చతికిల పడిపోతోంది. నిన్న మొన్నటి వరకు దేవరకద్ర కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌గా ఉన్న పవన్‌ కుమార్‌రెడ్డి హస్తానికి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిపోయారు. 2018లో కాంగ్రెస్‌ నుంచి పవన్‌కుమార్‌ రెడ్డే పోటీ చేశారు. ఇంఛార్జ్ పదవి కోసం పలువురు పోటీ పడుతున్నా పార్టీ ఎవరినీ ఎంపిక చేయలేదు. ఇంఛార్జ్‌ పదవి వస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయొచ్చని ఎవరి లెక్కల్లో వాళ్లు ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రత్యర్థిని బలహీన పర్చేందుకు సోషల్‌ మీడియాను వాడేసుకుంటున్నారు. కాంగ్రెస్‌ నాయకులే ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌తో కుమ్మక్కయ్యారని, కోవర్టు రాజకీయాలు చేస్తున్నారని ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు. కాగా ఈ ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి దంపతులు త్వరలో కాంగ్రెస్‌ కండువా కప్పుకొంటారని ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు కొత్తకోట దంపతులు టీడీపీలో వెలుగు వెలిగారు.

సీతా దయాకర్ రెడ్డి ఏకంగా మంత్రిగా పని చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా టీడీపీలోనే కొనసాగిన ఈ దంపతులు ఇప్పుడు రాజకీయంగా సైలెంట్ అయ్యారు. అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దయాకర్ రెడ్డి దంపతులను కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు ప్రయత్నాలు షురూ చేశారు. కాని ఎందుకనో దంపతులిద్దరూ కాంగ్రెస్‌లో చేరే విషయమై మీనమేషాలు లెక్కిస్తున్నారు. అయితే మక్తల్‌లో కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకుడు లేకపోవడంతో రేవంత్ రెడ్డి కొత్తకోట దంపతులను పార్టీలో చేర్చుకోవడం ఖాయమని తెలుస్తోంది. దేవరకద్ర లేదా మక్తల్‌ అసెంబ్లీ టికెట్‌ హామీతోనే వారి చేరిక ఉంటుందని టాక్‌. అదే జరిగితే దేవరకద్ర నుంచి సీతా దయాకర్‌రెడ్డి పోటీ చేయడం ఖాయమని చర్చ జరుగుతోంది. మొత్తం మీద దేవరకద్రలో హస్తం పార్టీని గట్టెక్కించే నాయకుడి కోసం కేడర్‌ ఎదురు చూస్తోంది. అయితే సీతాదయాకర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేసినా లాభం లేదని, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆలె వేంకటేశ్వర్ రెడ్డికి ఉన్న ప్రజాదరణతోపాటు, కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆమెను ఓడించడం ఖాయమని దేవరకద్రలో చర్చ జరుగుతోంది.

- Advertisement -