కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించిన : సీఎం కేసీఆర్‌

64
kcr
- Advertisement -


తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం ప్రారంభించారు. అంతకు ముందు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ వద్దకు వచ్చిన సీఎం కేసీఆర్‌కు ద్విచక్ర వాహనాలతో పోలీసులు స్వాగతం పలికారు. అనంతరం హోంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో కలిసి పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. సీసీసీ శిలాఫలకం వద్ద ప్రత్యేక పూజలు చేసి, ప్రారంభించారు. అనంతరం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌, సీపీ సీవీ ఆనంద్‌, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీస్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రం ప్రభుత్వం దేశంలోనే ప్రతిష్టాత్మకంగా పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని నిర్మించింది. ఏడెకరాల స్థలంలో రూ.600కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టింది. అత్యాధునిక పరిజ్ఞానంతో కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో ఏర్పాటు చేసింది. ఒకేసారి లక్ష సీసీటీవీ కెమెరాలు వీక్షించేలా బాహుబలి తెరలను కేంద్రం ఏర్పాటు చేశారు. అలాగే కేంద్రంలో అన్నిశాఖల సమన్వయానికి సైతం ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఏ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సీసీటీవీ కెమెరా దృశ్యాలైనా సరే హైదరాబాద్‌లో ఉన్న ఈ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి వీక్షించవచ్చు. అన్ని జిల్లాలు, పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలోని సీసీటీవీ కెమెరాలు ఆయా జిల్లా కేంద్రాల్లోని మినీ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లకు అనుసంధానించారు. అక్కడి నుంచి ఫీడ్‌ను నేరుగా సీసీసీకి జోడించారు. హైదరాబాద్‌ ఔటర్‌రింగ్‌ రోడ్డులోని సీసీటీవీ కెమెరాలు, మెట్రోస్టేషన్ల పరిధిలోని సీసీటీవీ కెమెరాల ఫీడ్‌ను సైతం సీసీసీతో అనుసంధానించినట్లు అధికారులు తెలిపారు.

command control centre

డయల్ – 100, అంబులెన్స్, ఫైర్స్, మహిళా భద్రత, షీ–టీమ్స్, హాక్ ఐ… ఇలాంటి వ్యవస్థలన్నీ ఒకే దగ్గర ఉండనున్నాయి. దీంతో అత్యవసర సమయాలతో పాటు బాధితుల నుంచి కంప్లైంట్లు వచ్చిన వెంటనే నిమిషం ఆలస్యం లేకుండా వెంటనే స్పందించేలా కంప్యూటర్ ప్రొగ్రామింగ్ ఉండనుంది. జీపీఎస్ పరిజ్ఞానం ఉన్న వాహనాలతో పాటు ఆస్పత్రులు, బ్లడ్ బ్యాంకులతో లింకు చేయనున్నారు. పబ్లిక్ నుంచి వచ్చే కంప్లైంట్లను విభాగాల వారీగా కేటాయింపు, సత్వర స్పందన, పరిష్కారం, వీటి మ్యాపింగ్ మొత్తం ఏఐ కంప్యూటర్‌లతోనే జరుగుతుంది. మార్కెట్, సోషల్ మీడియా విశ్లేషణ, మెబైల్ యాప్స్ కంప్లైంట్ల పరిష్కారానికి స్పెషల్ వ్యవస్థ ఉంటుంది. ప్రత్యేక ఎనలటిక్స్ గా పిలిచే సాఫ్ట్ వేర్స్ తో శాంతిభద్రతల పరిస్థితుల్ని అంచనా వేస్తారు. జీపీఎస్ టెక్నాలజీతో ఉన్న వాహనాలను అవసరమైన చోటుకు మళ్లించేలా ఏర్పాట్లు చేశారు.

ఎఫ్‌ఐఆర్‌ మొదలు కేసుల స్టేటస్ ను తెలుసుకోవడంతో పాటు, నేరగాళ్ల డేటాబేస్ నిర్వహణ, నేరాలు జరిగే ప్రాంతాల క్రైమ్ మ్యాపింగ్, అధ్యయనం, జైలు నుంచి విడుదలయ్యే నేరగాళ్లపై పర్యవేక్షణ, డిజిటల్ ఇన్వెస్టిగేషన్ లాబ్ ఇతర టూల్స్ నేరాల కంట్రోల్, కేసుల సత్వర పరిష్కారానికి ఉపయోగపడనున్నాయి. నేరాలను పసిగట్టే, నేరగాళ్ల కదలికల్ని గుర్తించే సాఫ్ట్ వేర్ ఎనలటికల్ టూల్స్ అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు డేటా ఎనాలసిస్, అడ్వాన్స్ సెర్చ్ కూ సాంకేతిక పరిజ్ఞానం వాడనున్నారు. అదనంగా ప్రత్యేక వెబ్ డిజైనింగ్ టూల్స్ తో మెరుగైన సేవలు అందించనున్నారు. 20 అంతస్తులున్న టవర్‌ ఏలోని 18వ అంతస్తులో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

- Advertisement -