టీటీడీపీకి అభ్యర్థులు కావలెను..!

217
telangana tdp
- Advertisement -

తానొకటి తలిస్తే దైవం మరోటి తలచిందంటే ఇదేనేమో…అసెంబ్లీ ఎన్నికల్లో త్యాగాల పేరుతో పోటీకి దూరంగా ఉన్న టీటీడీపీ నేతల ఫ్యూచ‌ర్ ప్లాన్ రివ‌ర్స్ కావడం దీనికి తోడు పార్లమెంట్ ఎన్నికల రూపంలో కొత్త సవాల్ ఎదురవుతుండటంతో ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే చక్రం తిప్పాలని భావించిన తెలుగు తమ్ముళ్లు కేవలం రెండు స్ధానాల్లో మాత్రమే గెలుపొందడం అందులో ఒక ఎమ్మెల్యే టీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతో ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది.

ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ ములిగే నక్కపై తాటిమట్టపడ్డ చందంగా తయారైంది. దీనికి తోడు మహాకూటమికి కాంగ్రెస్ రాంరాం చెప్పడం దాదాపు ఖాయం కావడం,17 స్ధానాల్లో హస్తం నేతలు పోటీకి సిద్ధమవుతుండటంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు టీడీపీ నేతలు. అసలు పార్టీ సంగతి పక్కనపెడితే తమ భవిష్యత్ ఏంటా అనే మీమాంసలో ఉండిపోయారు టీడీపీ సీనియర్ నేతలు పెద్దిరెడ్డి,రమణ,రావుల,మండవ వెంకటేశ్వరరావు.

అన్ని అనుకున్నట్లు జరిగితే తొలుత మల్కాజ్‌గిరి నుంచి ఎల్‌ రమణ,కరీంనగర్ నుండి పెద్దిరెడ్డి,నిజామాబాద్ నుండి మండవ,పాలమూరులోని ఎదో ఒక స్ధానం నుండి పోటీచేసేందుకు రావుల డిసైడ్ అయ్యారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ రివర్స్ కావడంతో అసలు ఎన్నికల్లో పోటీ అంటేనే జంకుతున్నారు. దీనికి తోడు గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒకరు గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవగా ఇంకొకరు ఇవాళో రేపో అన్నట్లు ఉగిసలాడుతున్నారు. దీంతో కొద్దొగొప్పో ఉన్న టీడీపీ క్యాడ‌ర్ పూర్తిగా నైరాశ్యంలోకి వెళ్లిపోయింది.

మొత్తంగా ఒకప్పుడు టీడీపీ బీఫామ్‌ కోసం ధర్నాలు నిర్వహించిన తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు పోటీసంగతి పక్కనపెడితే కనీసం అభ్యర్ధిత్వాన్ని పరిశీలించాలని కూడా కొరకపోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -