ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గత కొన్నాళ్లుగా సస్పెన్స్ లో కొనసాగుతున్న టీడీపీ జనసేన బీజేపీ పొత్తు వ్యవహారం తుది దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. ఇప్పటికే పొత్తులో ఉన్న టీడీపీ జనసేన పార్టీలు ఎలాగైనా బీజేపీని కూడా కలుపుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే బీజేపీ పెద్దలతో చర్చించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న డిల్లీ వెళ్ళిన సంగతి తెలిసిందే. డిల్లీలో అమిత్ షా, నడ్డా లతో సమావేశమయ్యారు కూడా. అయితే చంద్రబాబు ఏం అడిగారు ? బీజేపీ పెద్దలు ఏం చెప్పారు ? అనే ప్రశ్నలకు క్లారిటీ రాకముందే.. తాజాగా పవన్ కూడా ఢిల్లీ పయనం కావడం ఆసక్తిని రేపుతోంది. ప్రస్తుతం చంద్రబాబు కూడా డిల్లీలోనే ఉండగా పవన్ కూడా వెళుతుండడంతో ఈ రెండు రోజుల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి విషయంలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు చర్చ జరుగుతోంది. .
అయితే ఆల్రెడీ జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ కేవలం టీడీపీని మాత్రమే విభేదిస్తూ వచ్చింది. ఇప్పుడు స్వయంగా చంద్రబాబే పొత్తు కోరుతూ డిల్లీ వెళ్ళడంతో బీజేపీ తలోగ్గే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేసిన 2014 ఎన్నికల్లో విజయం వరించింది. ఈ నేపథ్యంలో మళ్ళీ అదే రిపీట్ కావాలంటే విభేదాలన్నీ పక్కన పెట్టి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమిగా ఏర్పడక తప్పని పరిస్థితి. అయితే కూటమి ఏర్పడినప్పటికి సీట్ల విషయంలో చిక్కుముడి ఏర్పడే అవకాశం ఉంది. మరి వాటన్నికి సమాధానంగా ఈ డిల్లీ ప్రయాణం నిలుస్తుందా ? అనేది చూడాలి. అయితే కుదిరితే బీజేపీని కలుపుకోవడం లేదంటే టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడం అనే విధానంతోనే పవన్, చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. మరి కూటమి విషయంలో కాషాయ పెద్దల ఫైనల్ డెసిషన్ ఎలా ఉండబోతుందో చూడాలి.