టీడీపీ జనసేన బీజేపీ పార్టీల పొత్తు అంశం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పొత్తులో ఉన్న టీడీపీ జనసేన పార్టీలు బీజేపీని కలుపుకునేందుకు గత రెండు రోజులుగా పార్టీల అధినేతలు డిల్లీకి మకాం వేసిన సంగతి తెలిసిందే. నడ్డా మరియు అమిత్ షా తో చర్చలు సాగించిన పవన్ చంద్రబాబు పొత్తును ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. మూడు పార్టీల పొత్తు ఖరారు అయిందని త్వరలోనే సీట్ల ప్రకటన చేయబోతున్నట్లు టీడీపీ నేత కనకమేడల తాజాగా వెల్లడించారు. పార్టీ బలాబలాలను బట్టి పోటీ చేసే స్థానాలపై నిర్ణయం ఉంటుందని, బీజేపీ, జనసేన పోటీ చేయగా మిగిలిన అన్నీ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని కనకమేడల చెప్పుకొచ్చారు. దీంతో గత కొన్నాళ్లుగా సస్పెన్స్ లో ఉన్న పొత్తు అంశానికి తెర పడినట్లైంది. .
ఇక మిగిలింది సీట్ల కేటాయింపు అంశమే. ఇప్పటికే టీడీపీ జనసేన పార్టీలు తొలిజాబితాలో సీట్ల ప్రకటన చేశాయి. టీడీపీ 94, జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనునట్లు ప్రకటించాయి. కానీ అప్పటికి బీజేపీ పొత్తు అంశం పెండింగ్ లో ఉండడంతో కమలం పార్టీకి సీట్ల కేటాయింపు జరగలేదు, ఇక తాజాగా బీజేపీ కూడా పొత్తుకు ఒకే చెప్పడంతో బీజేపీ జనసేన పార్టీలకు కలిపి మొత్తం మీద 30 అసెంబ్లీ సీట్లు, 8 లోక్ సభ సీట్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
అయితే సీట్ల కేటాయింపుకు సంబంధించి ఇంకా అధికారిక స్పష్టత రావాల్సివుంది. ఎట్టకేలకు మూడు పార్టీల మద్య పొత్తు ఒకే కావడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. 2014 లో ఈ మూడు పార్టీలు కలిసి ఎన్నికల బరిలో నిలువగా.. అప్పుడు ఈ కూటమి విజయం సాధించింది. ఇక పదేళ్ళ తరువాత మళ్ళీ టీడీపీ జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేయనుండడంతో ఈ కూటమికి ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఇక త్వరలోనే కూటమి తరుపున ఉమ్మడి సిఎం అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశం ఉంది. మరి గెలుపు లక్ష్యంగా ఏర్పడ్డ ఈ కూటమికి ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో చూడాలి.
Also Read:11న తెలంగాణ కేబినెట్ భేటీ