ఆదివారం తెలంగాణ భవన్‌లో మంత్రి తలసాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆ నియోజకవర్గ ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టారని అన్నారు. ప్రతి ఇల్లు గులాబీ జెండాను కోరుకుంటుందన్నారు. సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీ దిశగా గెలువబోతుందన్నారు. ఈ ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు సీఎం కేసీఆర్‌ను ఎలా విమర్శించారో అందరికీ తెలుసు. అలా మాట్లాడిన నాయకులకు సాగర్ ఓటర్లు కర్రుకాల్చి వాత పెట్టారు. సీఎం కేసీఆర్ ఇవాళ అన్ని వర్గాలను ప్రోత్సహిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
సాగర్ ఓటర్లు ఏ విశ్వాసంతో టీఆర్ఎస్ పార్టీకి ఓటేశారో, ఆ విశ్వాసంతోనే సాగర్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. నోముల భగత్‌కు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ మాత్రమే శ్రీరామరక్ష అని ఆయన అన్నారు. ప్రతిపక్ష పార్టీలు నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వాలి కానీ, విమర్శలు చేయడం సరికాదు అని తలసాని అన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఆదరించారు. నేడు సాగర్ ప్రజలు కూడా సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించారు. రేపు మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లోనూ తమ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీ సాధించబోతుందన్నారు మంత్రి తలసాని.