బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బిజెపి అగ్రనేతలపై లక్నోలోని ప్రత్యేక సిబిఐ కోర్టు మంగళవారం నేర అభియోగాలు నమోదు చేసింది. మాజీ ఉప ప్రధాన మంత్రి ఎల్.కె. అద్వానీ, బిజెపి సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి, కేంద్ర మంత్రి ఉమాభారతితో పాటు మరో తొమ్మిది మంది నేతలపై నేర అభియోగాలను కోర్టు నమోదు చేసింది. ఇదే క్రమంలో బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీకి ఎదురుదెబ్బతో పాటు, కాస్త ఊరట కూడా లభించింది.
బాబ్రీ మసీదు కేసు నుంచి తమను తప్పించాలంటూ బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే ఆడ్వాణీ, మరో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి, కేంద్ర మంత్రి ఉమాభారతి, తదితరులు దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్‌ను లఖ్‌నవ్ సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. అయితే, ఆడ్వాణీ సహా ఆరుగురికి బెయిల్ మంజూరు చేయడంతోపాటు రోజువారీ విచారణకు హాజరుకానక్కర లేదంటూ
కాస్త ఉపశమనం కలిగించింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసును మంగళవారం లఖ్‌నవ్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు విచారించింది. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై ప్రత్యేక కోర్టు రెండు వేర్వేరు కేసులను విచారిస్తోంది. మొదటి కేసులో ఆడ్వాణీ, జోషి, ఉమాభారతి, కతియార్, దాల్మియా, సాధ్వి రితంబర నిందితులుగా ఉన్నారు. రెండో కేసులో రాంవిలాస్ వేదాంతి, వైకుంఠ లాల్ శర్మ, చంపత రాయ్ బన్సల్, మహంత నృత్య గోపాల్‌దాస్, మహంత ధర్మదాస్, సతీశ్ ప్రధాన్ నిందితులుగా ఉన్నారు.
మొదటి కేసులో నిందితులుగా ఉన్న ఆడ్వాణీ తదితరులు.. మసీదు కూల్చివేత ఘటనలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని, కూల్చివేతను ఆపేందుకు తాము ప్రయత్నించామని వాదించారు. తమను కేసు నుంచి తప్పించాలంటూ డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. ఆడ్వాణీ, జోషి, ఉమాభారతి, తదితరులపై నేరపూరిత
కుట్ర అభియోగాల నమోదుకు తగిన ఆధారాలు ఉన్నాయని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎస్‌కే యాదవ్ స్పష్టం చేశారు. రెండు కేసుల్లో నిందితులుగా ఉన్న 12 మందిపై ఐపీసీ సెక్షన్ 120(బి) కింద నేరపూరిత కుట్ర అభియోగాలను నమోదుకు న్యాయమూర్తి ఆదేశించారు. ఆడ్వాణీ, జోషి, ఉమాభారతి, కతియార్, దాల్మియా, సాధ్వి రితంబర దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై కోర్టు సానుకూలంగా స్పందించింది. సీబీఐ వ్యతిరేకించినా వారికి బెయిల్ మంజూరు చేసింది.
ఇదిలా ఉంటే..ఆడ్వాణీ సహా ఇతర నేతలపై సీబీఐ నమోదు చేసిన నేరపూరిత కుట్ర కేసును పునరుద్ధరించాలని గత నెలలో సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం విదితమే. రెండేళ్లలోగా కేసు విచారణను ముగించాలని సీబీఐ ప్రత్యేక కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. 25 ఏళ్ల నాటి ఈ కేసులో ఆడ్వాణీ కోర్టుకు హాజరుకావడం ఇది రెండోసారి.
కాగా, మంగళవారం ఉదయం లఖ్‌నవ్ చేరుకొన్న ఆడ్వాణీకి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పూలగుచ్ఛంతో స్వాగతం పలికారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసును కేంద్రం ఉపసంహరించుకోబోదని కేంద్ర మంత్రి వెంకయ్య స్పష్టం చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేతలు ఎలాంటి మచ్చ లేకుండా బయటపడతారని ఆయన స్పష్టం చేశారు.